టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి వ్యవహారంతో పార్టీకి డ్యామేజీ జరగడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఆ ఇద్దరు హాజరై వివరణ ఇవ్వడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.
2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని టీడీపీ నేత వేమన సతీష్ తన దగ్గర 7 కోట్లు తీసుకున్నారని సుధా మాధవి అనే టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు చేశారు. తనకు చంద్రబాబు, లోకేశ్ తెలుసని, కచ్చితంగా టికెట్ ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అయితే, టికెట్ ఇప్పించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించానని అన్నారు. తన ఆస్తులమ్మి, అప్పు చేసి సతీష్ కు రూ.7 కోట్లు ఇచ్చానని చెప్పారు.
తన ఇల్లు కూడా అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా అడుగుతుంటే కేసులు పెడతానని, చంపేస్తామని సతీష్ బెదిరిస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనకు పోలీసులతో కూడా పరిచయాలున్నాయని, తన విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన భర్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.