పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ మేరకు పార్లమెంటు సచివాలయం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిసెంబరు 1వ తేదీ నుంచి పార్లమెంటు ఉభయ సభలు కొలువు దీరనున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజులు(వాస్తవానికి ఆదివారాలు, సెలవులు పోగా 12-14 రోజు లు) జరగనున్నాయి. కాగా.. ఈ సమావేశాల నుంచే రాజ్య సభలో ప్రస్తుత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారు.
ఇదిలావుంటే.. ఈ దఫా సమావేశాలు కూడా.. వాడి వేడిగానే సాగనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తు న్నారు. ప్రధానంగా పంజాబ్‌లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. అదేసమయంలో కర్ణాటకలో ఓట్ల చోరీ సహా.. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిని కూడా సభలో ప్రశ్నించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
వీటికితోడు.. తాజాగా కొత్త వివాదం తెరమీదికి వచ్చింది. ఆర్ ఎస్ ఎస్‌ను బహిష్కరించాలని కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. దీనిని రాజ్యసభలో చర్చకు కూడా పెడతానన్నారు. సో.. ఈ వ్యవహారం పెద్దల సభలో వేడి పుట్టించేఅవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా లేవనెత్తిన వివాదం.. వందేమాతరం. ఈ గేయాన్ని బెంగాల్‌కు చెందిన బంకించంద్ర చటర్జీ రచించారు.