టాలీవుడ్ క్వీన్ సమంత గురించి పరిచయాలు అవసరం లేదు. కట్టిపడేసే నటన, ఆకట్టుకునే అందంతో తెలుగు, తమిళ భాషల్లో అనతి కాలంలోనే ఈ బ్యూటీ భారీ స్టార్డమ్ ను సంపాదించుకుంది. కొంతకాలం ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాల నుంచి విరామం తీసుకున్న సమంత, ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫోర్స్‌తో రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తూనే, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. మరోవైపు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు.
తాజాగా సమంత తన కొత్త క్లాతింగ్ బ్రాండ్ ‘ట్రూలీ స్మా(Truly Sma)’ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను “కొత్త అధ్యాయం మొదలు” అనే క్యాప్షన్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో సమంత ఫ్యాషన్ స్టైల్, ఆత్మవిశ్వాసం, సింప్లిసిటీ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్‌లో సమంతను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
సమంత పోస్ట్‌పై సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సమంత ఎక్కడ అడుగు వేస్తే అక్కడ సక్సెస్ గ్యారెంటీ అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వ్యాపారవేత్తగా కూడా సమంత కొత్త రికార్డులు సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, ఇప్పటికే సమంత ‘సాకీ’ అనే ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా తన డిజైన్ టేస్ట్‌ని చూపించారు. ఆ తర్వాత పర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ‘ట్రూలీ స్మా’తో ఫ్యాషన్ రంగంలో ఆమె తన బిజినెస్ ఎంపైర్‌ను మరింత విస్తరించబోతున్నారు.