సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ.. `చింతిస్తున్నా` అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు.. దుమారం రేపి.. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆమె అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. అన్ని వైపుల నుంచి ఆమె కు ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని.. వెనక్కి తగ్గాలని సూచించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున విషయాన్ని ప్రస్తావించిన సురేఖ.. చింతిస్తున్నానని, నాగార్జునను నొ ప్పించి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తాను ఉద్దేశ పూర్వకంగా ఆయ నపైనా.. ఆయన కుటుంబంపైనా వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ``నాగార్జున కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆ నాడు నేను వ్యాఖ్యలు చేయలేదు. వారి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాలని కూడా నేను భావించడం లేదు`` అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మొత్తానికి ఇన్నాళ్లు తన తప్పును మీడియాపై రుద్దేసిన సురేఖ.. వెనక్కి తగ్గడం.. నాగార్జున కుటుంబానికి దాదాపు సారీ చెప్పినంత పనిచేయడం వెనుక ఏం జరిగిందన్నది తెలియకపోయినా.. పార్టీలో పెద్ద స్థాయి లో నాయకులు ఆమెకు దిశానిర్దేశం చేశారన్న వాదన అయితే.. వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో నాగార్జున కుటుంబం స్పందిస్తుందా? లేక.. న్యాయ పోరాటంపైనే దృష్టి పెడుతుందా? అనేది చూడాలి.
గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెరమీదికి వచ్చినప్పుడు.. సురేఖ నాగార్జున మాజీ కోడలు సమంతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఫోన్‌ల కారణంగానే కుటుంబంలో కలహాలు చోటు చేసుకున్నాయంటూ.. మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే నాగార్జున న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పటికే ఒకసారి కోర్టు నుంచి సమన్లు అందుకున్న మంత్రి.. తాజాగా ఈ కేసు మరింత దుమారం రేపుతుందన్న నేపథ్యంలోనే దిగివచ్చారు. మరి ఇప్పుడు నాగార్జున ఏం చేస్తారో చూడాలి.