తెలుగు సినిమా చరిత్ర గురించి రాస్తే ‘శివ’ సినిమాకు ముందు, ‘శివ’ సినిమాకు తర్వాత అని రాయాల్సి ఉంటుందనే మాటలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ‘శివ’తో ఒక కథను చెప్పే తీరును.. సన్నివేశాలను కన్సీవ్ చేసే వైనాన్ని పూర్తిగా మార్చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం విడుదలై 38 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇప్పుడు చూసినా నిత్య నూతనంగా ఉండడం ‘శివ’ ప్రత్యేకత.
‘శివ’ను రీమాస్టర్ చేసి, 4కేలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎడిటింగ్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నాడు వర్మ. అంతే కాక ప్రమోషన్లలో కూడా జోరుగా పాల్గొంటున్నాడు. ‘శివ’ విశేషాలను పలు వేదికల్లో పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ‘శివ’ సినిమాలో నాగ్ అన్న కూతురిగా కీలక పాత్ర పోషించిన చిన్నారి గురించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు.
సినిమాలో మురళీ మోహన్ కూతురి పాత్రలో కనిపించే చిన్నారి పాత్ర కథలో కీలకం. ఆ పాపతో కలిసి బయటికి వచ్చిన టైంలోనే భవాని గ్యాంగ్ శివ మీద ఎటాక్ చేస్తారు. ఆ పాపను ఎక్కించుకుని సైకిల్ మీద దూసుకెళ్తే సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో చివరికి ఆ పాప చనిపోతుందన్న సంగతీ తెలిసిందే. ఆ పాప పాత్రలో నటించిన అమ్మాయి పేరు సుష్మ అట. తన ప్రస్తుత ఫొటోను వర్మ ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి ప్రస్తుతం యుఎస్‌లో ఏఐ, కాగ్నిటివ్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తోందట.
సుష్మ గురించి పరిచయం చేస్తూ.. తనకు వర్మ సారీ కూడా చెప్పడం విశేషం. సైకిల్ చేజ్ సీన్ చేస్తున్నపుడు ఆ అమ్మాయి ఎంత భయానక అనుభవం ఎదుర్కొని ఉంటుందో ఆ సమయంలో గుర్తించలేదని.. దర్శకుడిగా తన దురాశ వల్ల ఆ చిన్న పాపతో అంత రిస్కీ షాట్స్ చేయించానని.. అందుకు ఆమె తనను క్షమించాలని కోరాడు వర్మ. దీనికి సుష్మ కూడా స్పందించింది. ‘శివ’ సినిమాలో నటించడం తనకు మరపురాని అనుభవమని.. ఆ సీన్ జీవితంలో సాహసాలు చేయడానికి సిద్ధపడేలా చేసిందని.. అప్పుడు తాను సురక్షితంగానే ఉన్నట్లు భావించానని ఆమె పేర్కొంది.