బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉద్రిక్తంగా కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచే ట్రెండ్స్ వేగంగా మారుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఈ కౌంటింగ్ ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రారంభం నుంచే విజయం తమదేనని ధైర్యంగా ప్రకటించారు.
రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన తేజస్వీ.. ప్రస్తుతం తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “మేమే గెలవబోతున్నాం. రాష్ట్రంలో మార్పు రాబోతోంది. కచ్చితంగా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.” అంటూ తేజస్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.
67.13% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమికే ఆధిక్యాన్ని సూచించాయి. అయితే ప్రతిపక్షాలు మొదటి నుంచి ఇవి తప్పేనని, ప్రజలు మార్పు వైపు మొగ్గు చూపుతున్నారని వాదించాయి. కాని కౌంటింగ్‌లో వెలువడుతున్న ట్రెండ్స్ మాత్రం మరో కథ చెబుతున్నాయి. బీహార్‌లోని 243 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 122 సీట్లు. కాని తాజా లెక్కింపుల ప్రకారం.. ఎన్డీయే 132 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్‌బంధన్ 72 స్థానాల్లో ముందంజలో ఉంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పూర్తిగా బలపరిచినట్లైంది. కొన్ని కీలక ప్రాంతాల్లో లెక్కింపు ఇంకా మిగిలి ఉండటంతో, అధికారిక ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ అలాగే కొనసాగనుంది.