మంత్రి కొండా సురేఖ మరియు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మధ్య నెలలుగా కొనసాగుతున్న వివాదం క్లైమాక్స్ కి చేరుకుంది. సినీ మరియు రాజకీయ వర్గాలను కుదిపేసిన ఈ కేసు తాజాగా కోర్టు ముందు పరిష్కారానికి రావడంతో ఇరువర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.కొండా సురేఖ పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పడం… నాగార్జున పెద్దమనసుతో స్పందించి కేసును ఉపసంహరించుకోవడం ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ వేసింది.
2024 అక్టోబర్‌లో నాగచైతన్య–సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపాయి. అక్కినేని కుటుంబం.. ముఖ్యంగా నటుడు నాగార్జున సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి సురేఖపై సెక్షన్ 280 BNSS కింద ఫిర్యాదు చేసారు. కేసు విచారణ దశకు కూడా చేరింది. ఈ వ్యవహారంలో కోర్టు నాగార్జునతో పాటు కొండా సురేఖ వాంగ్మూలాలు నమోదు చేయడంతో పరిస్థితిని మరింత సీరియస్ అయింది. అయితే తాజా పరిణామాలతో ఈ వివాదం పూర్తిగా ముగిసిపోయింది.
మంగళవారం రాత్రి మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. తన వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే అందుకు చింతిస్తున్నానని తెలిపారు. అక్కినేని కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. సురేఖ అధికారిక క్షమాపణ తర్వాత హీరో నాగార్జున కూడా శాంతియుత నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో వేసిన క్రిమినల్ దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు కోర్టు ఈ పిటిషన్‌ను ఆమోదం తెలిపి కేసును కొట్టివేసింది. నాగ్ వెనక్కి తగ్గడంతో లీగల్‌గా కొండా సురేఖకు బిగ్ రిలీఫ్ లభించింది.