బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభం కావడంతోనే రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ ఉధృతమైంది. ముఖ్యంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన మోకామా నియోజకవర్గంలో జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి ఎనిమిది రౌండ్ల వరకూ వచ్చిన ట్రెండ్‌లు ప్రకారం జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్(చోటా సర్కార్) భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అనంత్ కుమార్ సింగ్ ఇప్పుడు జైలులో ఉన్నారు. కానీ ఆయన జోష్ మాత్రం తగ్గలేదు.
జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో ఇటీవల అరెస్టయిన అనంత్ సింగ్ జైలులో ఉన్నప్పటికీ, ఈ విషయం ఆయన రాజకీయ ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. జైలు నుంచే బరిలోకి దిగిన ఆయన, తన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై గణనీయమైన ఆధిక్యం సాధిస్తూ ముందంజలో దూసుకుపోతున్నారు. 2020లో ఆర్జేడీ తరఫున గెలిచిన అనంత్ సింగ్, ఒక కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడ్డారు.
అయితే ఈసారి జేడీయూ తరఫున పోటీ చేసినా, మోకామాలో ఆయనకు ఉన్న పట్టు ఏ మాత్రం తగ్గలేదని ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండగానే అనంత్ సింగ్ ఇంటి వద్దే వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. గుడారాలు వేసి వందల కిలోల స్వీట్లు, ఆహారం తయారు చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `జైల్ కా ఫాతక్ టూటేగా… హమారా షేర్ చూటేగా(జైలు ద్వారాలు విరిగిపోతాయి… మన సింహం బయటకు వస్తాడు)` అంటూ రోడ్లపై కార్యకర్తలు పోస్టర్లు లేపుతున్నారు.
మొత్తానికి అనర్హత, అరెస్టు, జైలు.. ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అనంత్ సింగ్ తన ప్రాంతంలో ఇంకా ప్రజాధారణ కోల్పోలేదని ఈ ఎన్నికల ట్రెండ్‌లు స్పష్టంగా చాటుతున్నాయి. కాగా, మోకామా మాత్రమే కాదు, మొత్తం బీహార్‌లోనే ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 190 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండగా.. 49 స్థానాల్లో మహాఘటబంధన్ ఆధిక్యం చూపిస్తోంది. ఇక ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.