ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు విస్తరించిన కొద్దీ సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రెటీలు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా మోసపోయిన కేసులు పోలీసుల రికార్డుల్లో నమోదవుతున్నాయి. తాజాగా ఈ స్కామ్‌లో ఓ టీడీపీ ఎమ్మెల్యే భార్య కూడా చిక్కుకుని కోట్లు పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య డిజిటల్ అరెస్టుకు గురయ్యారు. ఒక రోజు ఆమెకు అన్‌నౌన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తులు తమను తాము `సీబీఐ అధికారులు, బ్యాంక్ పరిశోధకులు, పోలీస్ ఇన్వెస్టిగేటర్లు` అంటూ పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు మీద భారీ స్థాయి మనీ లాండరింగ్ జరిగిందని, ఇది జైలు శిక్ష పడే కేసు అని భయపెట్టడం మొదలు పెట్టారు.
తక్షణ విచారణ జరుగుతోందని, మీ ఫోన్‌ను ఆఫ్ చేయకండి… వీడియో కాల్‌లోనే ఉండండి అని ఆదేశించారు. భయంతో, ఒత్తిడితో ఆమె వారి మాటలు నమ్మక తప్పలేదు. మోసగాళ్లు స్క్రీన్‌పై నకిలీ డాక్యుమెంట్లు, కేసు వివరాలు, ట్రాన్సాక్షన్ రికార్డులు చూపుతూ మరింత భయంలోకి నెట్టారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ ప్రక్రియలోనే ఆమె నుంచి మొత్తం రూ. 1.70 కోట్లు లాగేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత, వారు వీడియో కాల్ కట్ చేసి కనిపించకుండా పోయారు.
మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని భర్త, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెప్పగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ స్కామ్‌లో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. సైబర్ నేరాల్లో బ్యాంక్ సిబ్బంది పాత్ర పెరుగుతోందని ఇది మరోసారి నిరూపించింది.