బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఆ దేశ రాజధాని ఢాకాలో ఉన్న అంతర్జాతీయ నేర వివాదాల పరిష్కార కోర్టు (ఐసీటీ) తాజాగా మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఇప్పటి కిప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. అయితే.. అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి పెరిగితే తప్ప.. హసీనా సేఫ్‌గానే ఉంటారు. అయితే.. బంగ్లాదేశ్‌లోను దాదాపు 30 ఏళ్లపాటు సుదీర్ఘంగా ప్రధాని హోదాలో పాలించిన హసీనా.. ఎందుకు ఇలా ఇరకాటంలో పడ్డారు?.. ఆమెకు ఎందుకు మరణ శిక్ష పడింది? అంత తప్పు ఆమె ఎందుకు చేశారు? అనేది కీలకం.
అంతేకాదు.. హసీనా చేసిన తప్పులను గమనిస్తే.. ప్రజాస్వామ్య దేశాల్లో పాలకులు ఎలా వ్యవహరించకూడదో కూడా అవగతం అవుతుంది. అంతేకాదు.. యువత, ఉద్యోగాలు, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలను పరిష్కరించే క్రమంలో అధినేతలు ఎలా వ్యవహరించాలో కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందన్నది కీలకం. బంగ్లాదేశ్ అనేది.. ఓ చిన్న దేశం. వాస్తవానికి ఇది భారత్‌లోనే భాగంగా ఉండేది. తర్వాత.. పాకిస్థాన్‌తో పాటు విడిపోయినా.. పాకిస్థాన్‌తనలో కలుపుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే 1971లో బంగ్లా-పాక్ దేశాల మధ్య యుద్ధం వచ్చింది. దీనిలో భారత్ జోక్యం చేసుకుని బంగ్లాకు స్వతంత్రం వచ్చేలా చేసింది.
నాటి యుద్ధంలో అమరవీరులు, అదేవిధంగా పాకిస్థాన్ సైనికుల చేతిలో అత్యాచారాలకు గురైన మహిళలు, హత్యకు గురైన మహిళలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇలా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారు.. పాక్ సైనికులతో అత్యాచారానికి గురైన మహిళల కుటుంబాలకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. అమరవీరుల కుటుంబాలకు 30%, అత్యాచారాలకు గురై మరణించిన మహిళల కుటుంబాలకు 10% రిజర్వేషణ్‌ను కొనసాగించారు. ఇవి.. సుదీర్ఘకాలం పాటు కొనసాగాయి. ఆతర్వాత.. ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న జిల్లాలకు(అంటే.. ఒక జిల్లాలో 100 మంది ఉద్యోగులు ఉన్నారనుకుంటే.. దీనికి పొరుగున ఉన్న జిల్లాలో 50 మంది మాత్రమే ఉంటే.. రిజర్వేషన్లను ఈ జిల్లాలకు అనుమతిస్తారు) 40 శాతం అమలు చేశారు.
వాస్తవానికి అప్పట్లో అంటే దేశం ఏర్పడే నాటికి కేవలం 4-5 కోట్ల మంది మాత్రమే జనాభా ఉన్న సమయంలో ఈ రిజర్వేషన్‌పై ఎక్కడా వివాదాలు రాలేదు. కానీ, 2010 లెక్కల ప్రకారం బంగ్లాదేశ్‌లో.. జనాభా 17 కోట్లకు చేరింది. దీరిలో యువత ఎక్కువగా ఉన్నారు. మరోవైపు దేశానికి ప్రత్యేకంగా ఆదాయ సంపత్తిలేదు. ఈ ప్రభావంతో నిరుద్యోగం ప్రబలింది. ఉద్యోగాల కల్పన, ఉపాధి సమస్య సర్కారును కుదిపే సింది. ఈ నేపథ్యంలోనే 2011 నుంచి స్వాతంత్ర సమర యోధులకు ఇస్తున్న రిజర్వేషన్ 30% తీసేవేయాలని అందరికీ మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఇది తొలినాళ్లలో యూనివర్సిటీల నుంచి ప్రారంభమైనా.. గత 2020 నాటికి క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంది.
2022లో ఢాకా హైకోర్టు రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అంటే.. మహిళల కోటా 10 శాతం, ప్రాతినిధ్య జిల్లాలకు 40 శాతం పోగా మిగిలిన 50 శాతం జనరల్‌కు దక్కాలని పేర్కొంది. కానీ, దీనిని హసీనా ప్రభుత్వంలోని కొందరు సవాల్ చేశారు. దీనిని ఆమె సమర్థించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మళ్లీ పాత విధానాన్ని అనుమతించాలని తీర్పు చెప్పింది. ఇది దావానలంలా చుట్టుముట్టింది. ప్రధానిగా ఉన్న హసీనానే.. తమకు ప్రధాన ముప్పు అని భావించిన విద్యార్థులు, నిరుద్యోగులు దేశవ్యాప్తంగా కదం తొక్కారు. ఈ సమయంలో ప్రధాని హోదాలో ఉన్న హసీనా.. సంయమనం పాటించేలా చేయాలి. కానీ.. ఆమె విచక్షణ కోల్పాయరన్నది తాజాగా కోర్టు చెప్పిన విషయం.
``ఆనాడు దేశం కోసం పోరాడిన కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. ఇది తప్పుకాదు. అలా కాకుండా.. ఈ రిజర్వేషన్‌ను రజాకార్లకు(పాక్‌తో చేతులు కలిపి.. బంగ్లాకు వ్యతిరేకంగా పోరాడిన వారికి) ఇస్తామా?`` అని రెచ్చగొట్టారు. అంతేకాదు.. సునిశితమైన విద్యార్థుల ధర్నాలు, నిరసనలపై ఉక్కుపాదం మోపారు. కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ఉపసంహరించుకున్నా.. అప్రకటితంగా ఆమె అదే పనిచేశారు. ఫలితంగా 1400 మంది యువత మృతి చెందారన్నది దర్యాప్తు సంస్థ చెప్పిన వాస్తవం. ఈ నేపథ్యంలోనే హసీనా ఉన్నపళంగా దేశాన్ని వీడి వచ్చారు. ప్రస్తుతం మరణ శిక్షను ఎదుర్కొంటున్నారు.