దర్శకధీరుడు రాజమౌళికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ‘రాష్ట్రీయ వానరసేన’ అనే హిందూ సంస్థ, ఆయనపై హనుమంతుడిని అవమానించారని ఆరోపిస్తూ అధికారిక ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ‘వారణాసి’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్‌యలు వివాదాస్పదం అయ్యాయి. వారణాసి మూవీ గ్లింప్స్ రిలీజ్‌కు వరుస సాంకేతిక ఆటంకాలు రావడంతో తీవ్ర ఆసహనానికి లోనైన రాజమౌళి ఈవెంట్ లో మాట్లాడుతూ.. `హనుమంతుడు నా వెనుక నిలబడి ఈ సినిమా చేయిస్తున్నాడని మా నాన్న అంటుంటారు, కానీ నాకు దేవుడిపై నమ్మకం మాత్రం లేదు` అని రాజమౌళి వ్యాఖ్యానించారు.
ఈ మాటలే ఆయన్ను ఇప్పుడు చిక్కుల్లో పడేశాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వానరసేన సభ్యులు, రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరుగుతోందంటూ వానరసేన ఆరోపించింది.
మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ, రాజమౌళిపై కేసు నమోదు చేసి, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదులో సంస్థ సభ్యులు కోరారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు. వానరసేన ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయి, నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రాజమౌళి వ్యాఖ్యలను తప్పుబడుతుంటే.. మరికొందరు దర్శకదీరుడిని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.