టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్స్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకరు. ప్రస్తుతం రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.నవంబర్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ హైప్ నడుస్తోంది. అయితే సినిమా కంటే ఎక్కువగా ఇప్పుడు రామ్ వ్యక్తిగత విషయమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కొంత కాలంగా రామ్ మరియు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే హోటల్‌లో కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సినిమాలోని రొమాంటిక్ సాంగ్ “నువ్వుంటే చాలు” రామ్ స్వయంగా రాయడం మరో సందేహానికి కారణమైంది. ఆ పాట భాగ్యశ్రీ కోసం రాశాడన్న ఊహాగానాలు కూడా ట్రెండింగ్ అయ్యాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై రామ్ రియాక్ట్ అయ్యాడు. ప్రముఖ మీడియాతో మాట్లాడిన రామ్, తనపై వస్తున్న ప్రేమ రూమర్‌లను పూర్తిగా ఖండించారు. రామ్ మాట్లాడుతూ.. `మేమిద్దరం ప్రేమలో ఉన్నామన్న వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. నేను సాంగ్ రాసే టైమ్‌కు అసలు హీరోయిన్ ఫైనల్ కూడా కాలేదు. చూడని అమ్మాయి కోసం ఎలా పాట రాయగలను?` అని రామ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతటితో ఆగకుండా, ప్రస్తుతం ప్రేమ, పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని రామ్ పేర్కొన్నారు. `ఎవరి మీదా ఆ ఫీలింగ్ లేదు. ప్రస్తుతం ఫోకస్ మొత్తం సినిమాలపైనే` అని ఆయన క్లియర్‌గా చెప్పడంతో గాసిప్‌లకు పూర్తిగా బ్రేక్ పడింది.