రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన `అన్నదాత సుఖీభవ` పథకం కింద.. ఏటా 20 వేల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిలో కేంద్రం ఇచ్చే 6000 పోను.. మిగిలిన 13 వేల రూపాయలను విడతల వారీగా పెట్టుబడి నిధి కింద రైతులకు జమ చేస్తున్నారు. ఇప్పటికే గత రెండు మాసాల కిందట రూ.7000 చొప్పున 46 లక్షల మంది అన్నదాత ఖాతాల్లో జమ చేశారు. దీనికి అదనంగా కేంద్రం రూ.2000 ఇచ్చింది. ఇది అన్నదాతలకు ఖరీఫ్ ప్రారంభం సమయంలో ఎంతో దోహదపడింది.
ఇక, ఇప్పుడు మరోసారి రూ.5000 చొప్పున ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతోపాటే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌లో రెండో దఫా రూ.2000లను ఈ నెల 19న విడుదల చేయనుంది. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈ దఫా రూ.5000 చొప్పున అదనంగా కలిపి(రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు) ఇవ్వనుంది. ఒకేసారి ఏకమొత్తంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సారి రూ.7000 చొప్పున అందించనున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు.. ఈ సారి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 19న అక్కడ జరిగే కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని రైతుల ఖాతాల్లో రాష్ట్ర సర్కారు వాటా కింద రూ.5000 ఇచ్చే కార్యక్రమానికి బటన్ నొక్కనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ములు జమకానున్నాయి. కాగా.. తొలి విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో నిర్వహించారు.
అప్పట్లోనూ 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. అర్హులై ఉండి ఇంకా ఎవరికైనా ఈనిధులు అందకపోతే.. పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. ఆధార్ సహా..పొలం వివరాలను అప్ లోడ్ చేసి రైతులు స్వయంగా ఈ పథకంలో చేరవచ్చు. దీనిని అధికారులు ధ్రువీకరించి వారిని లబ్ధిదారుల జాబితాల్లో చేర్చనున్నారు. అనంతరం వారికి కూడా నిధులు అందనున్నాయి.