ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు ‘ఇందిరమ్మ చీరలు’ పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది సంఖ్యలో మాత్రమే కాదు, రాజకీయంగా కూడా భారీ ప్రాజెక్ట్. అయితే ఇదే పథకంతో బీఆర్ఎస్ ఒకప్పుడు ఎంతలా ఇమేజ్ డ్యామేజ్ చేసుకుందో అందరికీ గుర్తే. అదే ట్రాక్‌లో రేవంత్ అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
బీఆర్ఎస్ కాలంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల క్వాలిటీపై మహిళల అసంతృప్తి పెద్దగా వ్యక్తమైంది. చీరలు చీప్‌గా ఉన్నాయంటూ రోడ్లపై వేసి తగులబెట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అప్పట్లో ప్రభుత్వం భారీగా బడ్జెట్ ఖర్చుచేసినా… మైలేజీ మాత్రం రాలేదు. మహిళలకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకపోవడం, దుస్తుల నాణ్యత లేకపోవడం… ఇవే గతంలో అసంతృప్తికి కారణం.
ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అదే సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చీరల క్వాలిటీ సంతృప్తికరంగా లేకపోతే స్కీమ్ బూమరాంగ్ కావడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరలను రెండు దశల్లో పంపిణీ చేయనుంది. మొదటి విడతలో నేటి(నవంబరు 19) నుంచి డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. రెండో విడతలో మార్చి 1 నుంచి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు పంచుతారు. అది కూడా రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన తెల్లరేషన్ కార్డులు ఉన్న మహిళలకు మాత్రమే.
చీరల పంపిణీలో రేవంత్ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి నిజమే. మహిళా ఓటర్లలో మంచి ఇంపాక్ట్ వస్తే అది ప్రభుత్వానికి బోనస్. కానీ స్కీమ్ సరిగ్గా అమలు కాలేకపోతే.. బీఆర్ఎస్‌లాగే రేవంత్ కూడా విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. చీరల పంపిణీ రాజకీయాల్లో కొత్తది కాదు. కానీ మహిళల అంచనాలు మాత్రం సంవత్సరాలకోసారి పెరుగుతూనే ఉన్నాయి. సో ఈసారి రేవంత్ ఇచ్చే చీరలు నిజంగా సంతృప్తినిస్తాయా? లేక బీఆర్ఎస్ కథే మళ్లీ రిపీట్ అవుతుందా? అన్నది చూడాలి.