ప్రముఖ సినీ నటి తులసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన దశాబ్దాల సినీ ప్రయాణానికి అధికారికంగా గుడ్‌బై చెప్పారు. డిసెంబర్ 31 నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన తులసి, వరుసగా దశాబ్దాలపాటు దక్షిణ భారత సినీ రంగానికి సేవలందిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విశ్వనాథ్, బాలచందర్ నుండి యువ దర్శకుల వరకూ ఆమె నటనపై నమ్మకం ఉంచటం తులసి ప్రతిభకు నిదర్శనం.
1967లో కుటుంబ స్నేహితురాలు అయిన నటి సావిత్రి అభ్యర్థన మేరకు `భార్య` మూవీలో ఒక పాటకు ఉయ్యాల సీన్‌లో కనిపిస్తూ తులసి సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆమె వయసు కేవలం మూడు నెలలు. 1974లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన `ఆరంగేట్రం` మూవీతో తులసికి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్‌పురి… ఈ అన్ని భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశారు.
కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తర్వాత కొంత విరామం తీసుకున్నా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తిరిగి వచ్చి సరికొత్త శకానికి శ్రీకారం చుట్టారు. సహాయక నటిగా ఓ వెలుగు వెలిగారు. తులసి నటనలో సహజత్వం, హృదయానికి హత్తుకునే డైలాగ్ డెలివరీ, కళ్ల లోతుల్లో కనిపించే భావ వ్యక్తీకరణ ఆమెను సినీ ప్రియులు గుండెల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
అయితే తులసి తన 58 ఏళ్ల సినీ ప్రయాణానికి విడ్కోలు పలకబోతున్నారు. డిసెంబర్ 31న షిరిడీ వెళ్తున్నానని, ఆ రోజు నుంచే తన రిటైర్‌మెంట్ ఉంటుందని తులసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన రిటైర్మెంట్ తర్వాతి జీవితాన్ని తులసి పూర్తిగా షిరిడీ సాయిబాబాకు అంకితం చేస్తానన్నారు. ఇకపై బాబా సేవలో బిజీ అవ్వాలని తులసి భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.