హైదరాబాద్‌లో ఆదాయ పన్ను అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయం లో అనూహ్యంగా ప్రారంభమైన దాడులు.. నాలుగు గంటల పాటు విస్తృతంగా జరిగాయి. భాగ్యనగరంలో పేరెన్నికగన్న అనేక హోటళ్లు.. వ్యాపార సంస్థలపై ఈ దాడులు జరిగాయి. ప్రధానంగా 15 కీలక వ్యాపార సంస్థలపై దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఆయా వ్యాపార సంస్థల నుంచి ఏమేం స్వాధీనం చేసుకున్నారు? ఎవరెవరిపై కేసులు పెట్టారు? అనే విష యాలను మాత్రం చెప్పలేదు. కాగా.. ఈ దాడుల నేపథ్యంలో కొన్ని జ్యువెలరీ దుకాణాలను సాయంత్రం 5 గంటలకే మూసి వేయడం గమనార్హం.
ఎందుకీ దాడులు..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు లక్ష కోట్ల రూపాయల వరకు ఆదాయపన్ను బకాయిలు ఉన్నట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ బకాయిలు అన్నీ..కేవలం భాగ్యనగరంలోనే ఉన్నాయన్న సందేహాలు ఉన్నాయి. నెలకు వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే సంస్థలు, హోటళ్ల యజమానులు కూడా పన్నులు ఎగవేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది మార్చిలోనే ఐటీ అధికారులు హెచ్చరించారు. వ్యాపార వర్గాలునిజాయితీగా వుండాలని.. పన్నులు చెల్లించాలని కూడా బహిరంగ ప్రకటన ఇచ్చారు. అయినప్పటికీ.. ఆశించిన మేరకు పన్నులు వసూలు కాలేదు.
ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ఐటీ దాఖలుకు సమయం ముగియనున్న నేపథ్యంలో(నవంబరు 30) ఆయా సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వీటిలో ప్రముఖ వ్యాపార సంస్థ పిస్తాహౌస్ సహా.. షా గౌస్, మెహిఫిల్ హోటల్ ఉన్నాయి. వీటికి విదేశాల్లోనూ బ్రాంచ్‌లుఉన్నాయి. ప్రధాన వ్యాపార కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ.. వీటికి ఇతర దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అయితే.. పన్నుల చెల్లింపుల విషయం లో మాత్రం ఈ సంస్థలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అదేసమయంలో దొంగ బిల్లులను కూడా పెట్టి పన్నుల ఎగవేతకు దారితీస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిస్తా హౌస్ యజమాని మాజిద్ నివాసంలో భారీ ఎత్తున బంగారం, విదేశీ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే లెక్కలు చూపని ఆదాయంతోపాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులను కూడా అధికారులు తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఒకే సారి 15 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడులతో హైదరాబాద్‌లోని కీలక వ్యాపార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దీంతో పాతబస్తీ సహా.. సికింద్రాబాద్‌లోని పలు జ్యువెలరీ షాపుల యజమానులు దుకాణాలను ముందుగానే మూసివేశారు.