ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేసే రామ్.. ఈసారి కాస్త భిన్నమైన కథతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చేశాడు. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక స్టార్ హీరో అభిమాని జీవితాన్ని ఇందులో చూపించబోతున్నారు. అందుకే దీనికి ‘బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమాను రామ్ చాలా స్పెషల్‌గా భావించి ఆరంభం నుంచి బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మూవీ కోసం స్వయంగా ఒక పాట రాశాడు. ఒక పాట పాడాడు. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నాడట. అతడి మనసుకు బాగా దగ్గరైన సినిమా ఇదని అర్థమవుతోంది. ప్రమోషన్ల మీద కూడా రామ్ ప్రత్యేక దృష్టిపెట్టాడు. ఇదంతా బాగుంది కానీ.. రామ్‌కు అభిమాన కథానాయికుడిగా ఇందులో నటించిన ఉపేంద్ర మాత్రం సినిమా ప్రమోషన్లలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఉపేంద్ర ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటే సినిమాకు ఇంకా క్రేజ్ పెరగడానికి అవకాశముంది. కన్నడలో కూడా ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తే అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. ఒక స్టార్ హీరో తెర మీద కూడా స్టార్ హీరోగా నటిస్తే అది క్రేజీగా ఉంటుంది. అలాంటపుడు ఆ హీరో ప్రమోషన్లలో పాల్గొనడం చాలా అవసరం. ఉపేంద్ర తెలుగులో అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తున్నా సరైన ఫలితం రావడం లేదు. ఈ చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. అలాంటపుడు ప్రమోషన్లలో కూడా కనిపించాలి. తెలుగులో కంటే కన్నడలో ఈ సినిమాను ఉపేంద్ర ప్రమోట్ చేయడం మార్కెట్ పరంగా చాలా అవసరం. అది సినిమా రేంజినే పెంచే అవకాశముంది. మరి ఎందుకు ఉపేంద్ర ఈ సినిమాను పట్టించుకోవట్లేదు అన్నది ప్రశ్నార్థకమే. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో అయినా ఉపేంద్ర ప్రమోషన్లలో ఇన్వాల్వ్ అయితే సినిమాకు చాలా మంచి జరుగుతుందనడంలో సందేహం లేదు.