ఐబొమ్మ, బొప్పం సైట్ల ద్వారా సినిమాల పైరసీకి పాల్పడిన ఇమ్మడి రవిని ఎన్ కౌంటర్ చేయాలని ప్రముఖ నిర్మాత సీ. కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒక ఎన్ కౌంటర్ జరిగితే తప్ప.. సినీపరిశ్రమ బాగుపడదన్నారు. సినిమా పైరసీలకు పాల్పడే వారికి తగిన విధంగా హెచ్చరించినట్టు కూడా ఉంటుందన్నారు. భవిష్యత్తులో పైరసీ అంటేనే హడలి పోయేలా చర్యలు ఉండాల ని అన్నారు. తాము ఎంతో ఆవేదనతో.. ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందని కల్యాణ్ చెప్పారు. మంగళవారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమపై కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నట్టు తెలిపారు.
వాస్తవానికి పైరసీకి వ్యతిరేకంగా గతంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ కృషి చేసిందన్నారు. యాంటీ వీడియో పైరసీ సెల్‌ను ఏర్పాటు చేసి.. బాలీవుడ్ సినిమాల పైరసీని అడ్డుకున్నట్టు కల్యాణ్ తెలిపారు. దీనికి కొందరు రిటైర్డ్ పోలీసులు కూడా సహకరించారని తెలిపారు. దీనికి మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఒక సినిమాను పైరసీ చేయడం అంటే.. లక్షల మంది జీవితాలను రోడ్డున పడేసినట్టేనని కల్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాతకు నష్టం వస్తే.. అది ఇండస్ట్రీ మొత్తానికి వచ్చినట్టేనని.. ఎవరూ సంతోషంగా ఉండరని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం కూడా పోతుందన్నారు.
ఇదిలావుంటే.. ఐ బొమ్మ ద్వారా సినిమాలు పైరసీ చేసి.. అదేవిధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పైరసీ ద్వారా వచ్చిన సొమ్ముతో దేశ , విదేశాల్లో ఖరీదైన బంగళాలు కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు రవి ఖాతాల నుంచి 3.5 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఇక, రవి వ్యవహారాలపై కూపీలాగుతున్న పోలీసులు.. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి సహకరిస్తున్నవారు? పైరసీ భూతం వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
మరోవైపు.. ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కూడా రవి విషయంపై దృష్టి పెట్టారు. నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ వంటి విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. ముఖ్యంగా బెట్టింగు యాప్‌లను ప్రమోట్ చేయడం.. వాటి ద్వారా నెల కు రూ.10 లక్షలకు పైబడి సొమ్మును ఆర్జించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఈడీ దృష్టి పెట్టనుంది. విదేశాల్లో ఆస్తుల కొనుగో లు.. ఈ క్రమంలో డబ్బులు ఎవరెవరి చేతులు మారిందన్న అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. మొత్తానికి రవిని అనేక కేసులు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది.