ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాదాలకు మాజీ విశ్వసుందరి, ప్రముఖ బాలీవుడ్‌నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ నమస్కారం చేశారు. తాజాగా ఏపీలోని పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్యసాయిబాబా నిగమాగమంలో జరిగిన బాబా శత జయంతి వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా .. పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్ ఉన్నారు.
అయితే.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఆమె మైకు అందుకోగానే.. ప్రధాని నరేంద్ర మోడీకి చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం.. సాయి బాబా చేసిన సేవలను ఆమె కొనియాడారు. నడిచే దేవుడని.. సమాజానికి బాబా సేవలు ఎన్నో చేశారని పేర్కొన్నారు. ఇలా.. ఓ 5 నిమిషాలు ఇంగ్లీష్‌లో ప్రసంగించిన ఐశ్వర్య.. అనంతరం.. తన ప్రసంగాన్ని ముగించి.. ప్రధాని మోడీ వద్దకు వెళ్లి పాదనమస్కారం చేశారు. అయితే.. మోడీ ఆమెకు ప్రతిగా నమస్కారం చేశారు.
ఈ విషయంపై నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``ఐశ్వర్య ఎందుకో భయపడుతున్నారు`` అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారా? అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు.. `ఏదీ ఆశించకుండా.. ఐశ్వర్య ఎందుకిలా చేస్తారు`` అని అన్నారు. మరికొందరు..`ఐశ్వర్య మారిపోతున్నారు. బీజేపీలో చేరుతున్నారా?`` అని అన్నారు. కాగా.. తన ప్రసంగంలోనూ మోడీని ఐశ్వర్య భారీ ఎత్తున కొనియాడడాన్ని మరికొందరు ప్రస్తావించారు.
ఇదిలావుంటే.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ అత్తగారు, అమితాబ్ సతీమణి జయా బచ్చన్.. రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీ సమాజ్ వాదీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఇండియా కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య పాదనమస్కారంపై.. అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.