తెలుగు సినీ పరిశ్రమను ఎంతోకాలంగా వేధిస్తున్న పైరసీ సమస్యలో ఐబొమ్మ సైట్ ఒక ప్రధాన పాత్ర పోషించింది. నిమిషాల్లో కొత్త సినిమాలు లీక్ చేస్తూ, వీకెండ్ రిలీజ్‌లకు కూడా నష్టం కలిగించిన ఈ వెబ్‌సైట్‌పై పోలీసులు ఇటీవల భారీగా దాడులు జరిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సైట్ నిర్వాహకుడు రవిని అరెస్టు చేయడంతో పైరసీ చక్రం ఒక్కసారిగా కూలిపోయిందని అనుకున్నారు. ఐబొమ్మ ఇంటర్‌ఫేస్, టెక్ సపోర్ట్, కంటెంట్ అప్‌డేట్స్ మొత్తం రవి నెట్‌వర్క్‌దేనని తేలడంతో, అతడి అరెస్టు తర్వాత సైట్ పూర్తిగా షట్‌డౌన్ అయ్యింది. ఈ పరిణామంతో సినీ నిర్మాతలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, ఈ కథ ఇక్కడితో ముగిసిందనుకునే సమయంలోనే బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐబొమ్మ మూతపడిన కొన్ని రోజులు గడవకముందే, ‘ఐబొమ్మ వన్’ అనే కొత్త వెబ్‌సైట్ ప్రత్యక్షమై పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈ కొత్త సైట్‌ను ఓపెన్ చేసిన వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. లోగో, యూజర్ ఇంటర్‌ఫేస్, లేఅవుట్ అన్నీ పాత ఐబొమ్మను పోలి ఉన్నాయి. పాత సైట్‌లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉండగా, ‘ఐబొమ్మ వన్’లో మాత్రం తమిళ్, హిందీ తదితర భాషల సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ కొత్త సైట్ వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నెలకొంది. రవి అనుచరులే కొత్త సైట్‌ను యాక్టివ్ చేశారా? లేక దీనికి పూర్తిగా మరో పైరసీ గ్యాంగ్ సంబంధించిందా? అన్నది ఇంకా స్పష్టత లేదు. కాగా, కొత్త సైట్‌లో ఏ సినిమా మీద క్లిక్ చేసినా, అది నేరుగా మరో పెద్ద పైరసీ సైట్ మూవీ రూల్జ్‌కు రీడైరెక్ట్ అవుతోందని సైబర్ క్రైమ్ టీమ్ గుర్తించింది. అంటే ‘ఐబొమ్మ వన్’ స్వతంత్ర సైట్ కాదు… మూవీ రూల్జ్‌కు ట్రాఫిక్‌ను పెంచేందుకు రూపొందించిన ఒక డమ్మీ సైట్ కావొచ్చు అన్న అనుమానం బలపడుతోంది.
ఐబొమ్మ ఎకోసిస్టమ్‌లో 65కి పైగా మిర్రర్, ప్రాక్సీ సైట్లు పనిచేస్తున్నాయని పోలీసులు ఇంతకుముందు వెల్లడించారు. వీటిలో ఏదైనా సబ్ నెట్‌వర్క్ ఆధారంగా ఈ కొత్త వెబ్‌సైట్‌ను మళ్లీ ఫ్లోట్ చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పెద్ద పైరసీ ప్లాట్‌ఫార్మ్‌లపై కూడా అదే స్థాయిలో చర్యలు చేపట్టాలని సినీ పరిశ్రమ నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి.