చుక్కా రామయ్య...ఈ పేరు తెలియని తెలుగు ప్రజలుండరు. ఐఐటీ రామయ్యగా పేరు ప్రఖ్యాతలు గడించిన రామయ్య ఎందరో విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కూడా అయిన రామయ్య చలవతో వేలాదిమంది ఐఐటీయన్లుగా మారి దేశవిదేశాల్లో అత్యున్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మొదలు ఎందరో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఆయన విద్యార్థులే. ఎంతోమందిని ఐఐటీయన్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన చుక్కా రామయ్య నేడు 100వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ గురువు చుక్కా రామయ్యకు ఆయన విద్యార్ధులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
1925, నవంబర్ 20న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి, తండ్రి, గురువు, దైవం...అన్న మాటకు అక్షర రూపం చుక్కా రామయ్య. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని నిరూపించిన విద్యావేత్త ఆయన. ఐఐటీ అంటే ఉత్తరాది వారికే అందుతుందని, తెలుగు ప్రజలకు ఐఐటీ అంటే అందని ద్రాక్ష అని అనుకుంటున్న తరుణంలో చుక్కా రామయ్య తన కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. చుక్కాని లేని నావలా సాగుతున్న తెలుగు విద్యార్థుల పాలిట చుక్కా రామయ్య చుక్కానిగా మారి ఐఐటీ ఎంట్రన్స్ లో అద్భుతమైన కోచింగ్ ఇచ్చారు.
ఐఐటీ శిక్షణలో దశాబ్దాల పాటు వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన చుక్కా రామయ్య ఇంటి పేరు ఐఐటీ రామయ్యగా మారిందంటే ఆయన ఎంత పాపులర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. నీతి నిజాయితీ, నిబద్దతలకు ప్రతిరూపమైన చుక్కా రామయ్య మాస్టారుకు ఆయన విద్యార్థులు శత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయురారోగ్యాలతో ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. నిత్య విద్యార్థిగా, వేలాదిమందికి గురువుగా, సామాజిక సంస్కర్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఎమ్మెల్సీగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన చుక్కా రామయ్య మాస్టారు నేటి తరానికి స్ఫూర్తి.
ఆరోగ్య నియమాలు, ఆహారపు అలవాట్లు పాటించే చుక్కా రామయ్య శత జన్మదినం జరుపుకోవడంపై ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో శతాధిక వృద్ధులు అరుదుగా ఉంటున్న తరుణంలో చుక్కా రామయ్య తన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న వైనం ఈ తరం వారికి ఎంతో స్ఫూర్తి దాయకం అని చెప్పవచ్చు.