ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నేడు 100వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యానగర్‌లోని చుక్కారామయ్య నివాసానికి కేటీఆర్ వెళ్లి రామయ్యను శాలువాతో సత్కరించారు. విద్యా ప్రదాతగా, తెలంగాణ పోరాట యోధుడిగా, రాజకీయవేత్తగా ఆయన తనదైన పాత్ర పోషించారని కొనియాడారు.
ఐఐటీ అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు, విద్య అంటే గుర్తుకొచ్చే మార్గదర్శి, సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంతా చుక్కా రామయ్యేనని కితాబిచ్చారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమంది ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య అని ప్రశంసించారు. ఆయన ఆరోగ్యంగా, సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు చుక్కా రామయ్య ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘‘సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని నిరూపించిన విద్యావేత్త...మాజీ ఎమ్మెల్సీ... తెలుగు నేలపై విద్యా వికాసానికి చుక్కాని వంటి మాస్టారు చుక్కా రామయ్య గారు. ఐఐటీ శిక్షణ ద్వారా దశాబ్దాల పాటు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది 'IIT రామయ్య'గా గుర్తింపు పొందారు. సమాజంలో నీతి నిజాయితీ, నిబద్దతలకు ప్రతిరూపమైన చుక్కా రామయ్య గారికి నూరవ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.’’ అని సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధులైన చుక్కా రామయ్య గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వేలాదిమంది విద్యార్థులను ఐఐటీయన్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన గురువైన చుక్కా రామయ్య గారు నేర్చుకోవడంలో నిత్య విద్యార్థి. సామాజిక సంస్కర్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఎమ్మెల్సీగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన చుక్కా రామయ్య గారు నేటి తరానికి స్ఫూర్తి.’’ అని మంత్రి లోకేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.