హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణలతో జీహెచ్ఎంసీ రాడార్‌లో పడ్డాయి. ట్రేడ్ లైసెన్స్ ఫీజు విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించిన అధికారులు, రెండు స్టూడియోలకు అధికారిక నోటీసులు జారీ చేశారు. నగరంలో పెద్ద పేర్లు ఉన్న స్టూడియోలపై ఇలాంటి చర్య తీసుకోవడం ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
జీహెచ్ఎంసీ సర్కిల్–18 అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఈ లోపాలు బహిర్గతమయ్యాయి. ఇరు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపడంతో, చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులో భారీ తేడా కనిపించింది. సంవత్సరాలుగా ఇదే విధానం కొనసాగుతున్నట్టు అధికారులు నిర్ధారించారు.
అధికారిక వివరాల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియో ఏటా చెల్లించాల్సిన రూ. 11.52 లక్షల ఫీజుకు బదులుగా కేవలం రూ. 49 వేలే చెల్లిస్తోంది. ఇదే విధంగా, రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన రూ. 2.73 లక్షలకు బదులుగా కేవలం రూ. 7,600 మాత్రమే బల్దియాకు చెల్లించినట్టు బయటపడింది. విస్తీర్ణం తక్కువగా చూపడం వల్లే ఈ భారీ వ్యత్యాసం ఏర్పడిందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
ఈ పన్ను ఎగవేతను అత్యంత తీవ్రంగా పరిగణించిన బల్దియా, వెంటనే బకాయిలను పూర్తిగా చెల్లించాలని స్టూడియోలకు ఆదేశించింది. అలాగే, వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. లైసెన్స్ నిబంధనలు పాటించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ప్రముఖ స్టూడియోలపై ఈ విధంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.