బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశా రు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ రేవంత్ ముఠా రెచ్చిపోతోందని అన్నారు. ఈ క్రమంలో ఏకంగా 4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించా రు. భూములను బతకనివ్వడం లేదని విమర్శించారు. ప్రముఖ ప్రాంతం బాలా నగర్ లో సుమారు 9 వేల 300 ఎకరాలకు పైగా భూముల కుంభకోణం జరుగుతోందన్నారు.
బాలానగర్, కాటేదాన్, జీడిమెట్లలోని అత్యంత విలువైన భూములను సీఎం రేవంత్ రెడ్డి తన వారికి పందేరం చేశారని.. ఈక్రమంలో జేబులు కూడా నింపుకుంటున్నారని తన వాళ్లు చెప్పినట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీని విలువ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలపైనే ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో పర్యటించినప్పుడు.. గుట్టు చప్పుడు కాకుండా.. ఇక్కడ వ్యవహారాలు చక్కబెట్టేలా.. వ్యవహరించారని చెప్పారు. అయితే.. ఈ భూముల విషయంలో తాము న్యాయ పోరాటం చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు.
భూములు కుంభకోణం జరుగుతోందన్నది వాస్తవమేనని కేటీఆర్ పదే పదే చెప్పారు. అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, సీఎం సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భూముల అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తామన్న కేటీఆర్.. కొనుగోలు చేసిన వారు.. అక్రమాలకు పాల్పడిన వారు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. గతంలో తమను కూడా కొందరు ఇలానే చేయమన్నారని చెప్పారు.
కానీ, తాము నిజాయితీ చేశామని.. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన విషయాలను కేటీఆర్ చెప్పుకొచ్చారు. పరిశ్రమల పేరుతో కూడా.. భూముల కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తమ హయాంలో భూముల విక్రయానికి సంబంధించిన నియంత్రణ చట్టం తెచ్చామన్నారు. 100 శాతం ఫీజు కట్టేలా నిబంధనలు మార్చినట్టు తెలిపారు. కానీ.. పటిష్టమైన ఆ నిబంధనలను ప్రస్తుత ప్రభుత్వం మార్చేసి.. ప్రజల సొమ్మును కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.