గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎక్కడికి వచ్చినా చుట్టూ జనం విషయంలో లోటు ఉండదు. అది ఏ రకమైన అభిమానం అనే విషయంలో ఎప్పుడూ ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఆ జనాన్ని పార్టీ వాళ్లు మొబిలైజ్ చేస్తారా.. లేదా జనమే జగన్‌ను చూడ్డానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారా అనే చర్చ జరుగుతుంటుంది.
ఏదైనా విషాదంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వచ్చినా.. లేదా నష్టపోయిన రైతులను కలిసినా.. ఇంకే సందర్భం అయినా సరే.. జగన్ చుట్టూ ఉన్న జనం సీఎం సీఎం అనో.. జై జగన్ అనో నినాదాలు చేస్తుంటారు. అలాంటపుడే వాళ్లది ఏ రకమైన అభిమానం అనే సందేహాలు మరింత బలపడుతుంటాయి. తాజాగా జగన్ హైదరాబాద్ వచ్చారు. ఆయన 22 నెలల తర్వాత ఈ నగరంలో అడుగుపెట్టారు.
జగన్ విమానాశ్రయంలో దిగిన బయటికి వచ్చినప్పటి నుంచి జనం పోటెత్తారు. దారి పొడవునా ఆయన వెంట పెద్ద ఎత్తున వాహనాలు వెళ్లాయి. ఇక నాంపల్లి కోర్టు దగ్గర కూడా కోలాహలం నెలకొంది. ఐతే జగన్ హైాదరాబాద్ రానుండడం గురించి ముందు నుంచే సోషల్ మీడియాలో ఎలివేషన్లు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో అడుగు పెడుతున్న పులి అంటూ తమదైన శైలిలో హైప్ ఇచ్చుకున్నారు జగన్ ఫ్యాన్స్. ఇక ఆయన వచ్చాక పోగైన జనాన్ని చూపించి కూడా అదే రకమైన ఎలివేషన్ వేసుకుంటున్నారు.
కానీ ఆయన అసలు ఎందుకు హైదరాబాద్ వచ్చారు అన్నది మాత్రం వాళ్లు మాట్లాడడం లేదు. తన మీద ఉన్న అవినీతి కేసులకు సంబంధించిన విచారణ కోసం నిందితుడిగా జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. రకరకాల కారణాలు చెప్పి కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్న జగన్‌కు ఈసారి కోర్టు గట్టిగా హెచ్చరిక జారీ చేసి హైదరాబాద్ రప్పించింది. సందర్భం ఇదైనపుడు దాని గురించి ప్రస్తావించకుండా.. జగన్ హైదరాబాద్ వచ్చాడు, జనం పోటెత్తారు అంటూ ఎలివేషన్లు వేసుకోవడం వైసీపీ అభిమానులకే చెల్లింది.