జనసేనలో ఇటీవలి కాలంలో నాయకత్వ సమీకరణలు భారీగా మారుతున్నాయి. కొంతకాలం వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్ని వ్యవహారాలను పర్యవేక్షించిన నాగబాబు ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నాదెండ్ల మనోహర్ ఫీల్డ్ ఆపరేషన్స్‌ను చూసుకుంటే… మిగిలిన అన్ని ఆర్గనైజేషనల్ పనులను నాగబాబు సమర్థవంతంగా నడిపేవారు. కానీ ఇటీవల ఆ బాధ్యతలను సినీ నిర్మాత రామ్ తాళ్లూరికి అప్పగించారు పవన్.
పార్టీ ఆఫీసులో ప్రస్తుతం రామ్ తాళ్లూరి యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. రోజూ ఆఫీసుకు వచ్చి ఫైళ్ళు, మీటింగులు, కోఆర్డినేషన్.. అన్నింటినీ పర్సనల్‌గా మానిటర్ చేస్తున్నారు. ఒకరకంగా నాగబాబు లేని లోటును పూడుస్తున్నారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పార్టీ గ్రౌండ్ లెవెల్లో మరింత యాక్టివ్‌గా ఉంటారని అందరూ భావించారు. ముఖ్యంగా ఆయనకు మంత్రి పదవి ఖరారు చేశారని తెలిసిన తర్వాత… ఆయన వేగం మరింత పెరుగుతుందని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ అయ్యాక ఆయన పూర్తిగా ఇనాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. మండలి సమావేశాలకు మాత్రం వస్తున్నా… పార్టీ వర్కింగ్‌లో ఆయన జోక్యం గణనీయంగా తగ్గిపోయింది.
ఎమ్మెల్సీగా ఎన్నిక కాక ముందే మంత్రిగా ప్రమాణం చేస్తారని అనుకున్నారు. కానీ, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఎమ్మెల్సీ అయ్యాక కూడా మంత్రివర్గంలో ప్రవేశం జరగకపోవడం.. అదే సమయంలో నాగబాబు పూర్తిగా ఇనాక్టివ్ కావడం.. రెండు అంశాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. నాగబాబు మౌనం తాత్కాలికమా? లేక పార్టీ వ్యూహంలో పెద్ద మార్పుకి సంకేతమా? పవన్ భవిష్యత్ రాజకీయ లెక్కల్లో నాగబాబు పాత్ర ఏ స్థాయికి చేరనుందో రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం జనసేనలో తాళ్లూరి టేకోవర్ స్పష్టమవుతోంది అనేది పార్టీ వర్గాల టాక్.