2024 లో ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, కొందరు ఎన్నారైలు చేస్తున్న వ్యాఖ్యలు, పనుల వల్ల పార్టీకి, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఎన్నారైలను ఏకతాటిపైకి తెచ్చిన సౌమ్యుడు డాక్టర్ రవి వేమూరి వంటి సీనియర్ నాయకులపై సైతం బురద జల్లేందుకు వెంకట్ కోడూరి వంటి వారు వెనుకాడడం లేదు. దీంతో, వెంకట్ కోడూరి వంటి వారిపై పార్టీ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలు కోరుతున్నారు.
2014 లో టీడీపీ హయాంలో ఎన్నారైల కోసం ఏదో చేయాలన్న తపనతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో అమెరికాలో స్థిరపడి వైద్యవృత్తిలో ఉన్న ప్రముఖుడు డాక్టర్ రవి వేమూరిపై చంద్రబాబు దృష్టి పడింది. దీంతో, ఆయనను ఎన్నారై సంబదిత వ్యవహారాల్లో సలహాదారుడిగా ఆయన నియమించారు. దీంతో, వైద్యవృత్తి ని వదులుకుని ఎన్నారైలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేశారు రవి వేమూరి. ప్రత్యేకంగా ఎన్నారైలకోసం ఒక సంస్థ ఉండాలని భావించిన ఆయన ఏపీఎన్నార్టీఎస్ కు రూపకల్పన చేశారు.
ఎన్నారై టీడీపీ ఏర్పాటు చేసి ఎన్నారై నేతలందరినీ ఒక్కటిగా చేసిన ఘనత కూడా ఆయనదే. 2022లో ఎన్నారై టీడీపీ కమిటీలను ఏర్పాటు చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఎన్నారైల పాత్రను కీలకంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, 2014-2019 మధ్యకాలంలో కువైట్ లో ఉండే వెంకట్ కోడూరి వంటి కొందరు నేతలు టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వెంకట్ కోడూరి...ఇటు ప్రభుత్వంపై, యువనేత లోకేష్, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలపై పబ్లిక్ గా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పార్టీ పరువు తీసినా పార్టీ ఉపేక్షించింది.
2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే వెంకట్ కోడూరి టీడీపీ నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా విమర్శించి పార్టీ వీడిన వెంకట్ కోడూరిని మరే పార్టీ ఆహ్వానించలేదు. దీంతో, మళ్ళీ టీడీపీ లో యాక్టివ్ గా ఉన్నట్లు నటిస్తూ పార్టీపై బురదజల్లడం మొదలుబెట్టారు వెంకట్ కోడూరి. ఆయన ఫేస్ బుక్ వాల్ నిండా టీడీపీని విమర్శిస్తూ పార్టీకి డ్యామేజీ చేసే పోస్టులే దర్శనమిస్తాయి.
ఇక తాజాగా ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరిని టార్గెట్ చేయడం మొదలుబెట్టారు వెంకట్ కోడూరి. ఆయన అడుగులకు మడుగులొత్తే కొందరు ఎన్నారైలను వెంటబెట్టుకొని టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. కువైట్ లో వైసీపీ నేతలతో అంటకాగే వెంకట్ కోడూరి...పైకి మాత్రం టీడీపీ నాయకుడినని చెప్పుకుంటుంటారు. ఇకపై వెంకట్ కోడూరి వంటి వ్యక్తులను ఉపేక్షించకూడదని పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలని కువైట్ లోని అసలు సిసలు ఎన్నారై టీడీపీ నేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీడీపీ నేతలు కోరుతున్నారు. లేదంటే పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.