శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఏపీలో పర్యటించారు. ఉప రాష్ట్రపతి రాధా కృష్ణన్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి తొలిసారి విచ్చేశారు. ఈ ఇద్దరికీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. సత్యసాయి నిరంతరం బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మార్గాలు అనుసరణీయమని ముర్ము అన్నారు.
లోక కల్యాణం కోసమే ఆయన పాటుపడ్డారని, ఈ వేడుకల్లో పాల్గొనడం తన భాగ్యం అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన మహానుభావుల్లో ఆయన అగ్రగణ్యులని తెలిపారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం విశేష కృషి చేస్తోందని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 1969 నుంచే మహిళా సంక్షేమానికి బాబా ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.
లవ్ ఆల్.. సర్వ్ ఆల్ అనే సిద్ధాంతాన్ని బాబా నమ్మారని, ఆయన ప్రవచించిన పంచ సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతితో వర్ధిల్లుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి బాబాతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించారని తెలిపారు.