భగవాన్ శ్రీసత్యసాయి బాబా.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు.. దాదాపు ఈ ప్రపంచంలోని అన్ని దేశాలకు సుపరిచితం. ఎక్కడో మారుమూల వెనుకబడిన దేశమైన మంగోలియా వంటి దేశాల్లోకూడా.. సత్యసాయి ఆశ్రమాలు.. ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కారణం.. ఆయన నమ్మిన, ఆయన విశ్వసించిన వసుధైక కుటుంబం-ప్రేమతత్వమే కారణం!. ``అందరినీ ప్రేమించు-అందరినీ సేవించు`` అనే సూక్తి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
అయితే.. ఆయన మరో మాట కూడా చెప్పారు. `అందరినీ మెప్పించు-ఎవరినీ నొప్పించకు` అనే సూక్తి కూడా ఆయన తరచు చెప్పేవారు. నేటికి(ఆదివారం, నవంబరు 19) 100 సంవత్సరాల కిందట.. అనంత పురం జిల్లా పుట్టపర్తి అనే గ్రామం(ఇప్పుడు నియోజకవర్గం)లో జన్మించిన సత్యసాయి.. `భట్రాజు` కుటుంబంలో జన్మించారు. ఆయనకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు సాధారణ వ్యక్తిగానే జీవించినా.. తర్వాత.. మార్పు కనిపించింది.
తాను ఈ ప్రపంచానికి సాధరణ వ్యక్తిగానే వచ్చానని ఎప్పుడూ అనేవారు కాదు. అసాధారణ పనులు చేసేం దుకు ఆ దేవదేవుడు తనను ఇక్కడకు పంపించారని చెప్పుకొనేవారు. ఆయన చేసిన పనులు కూడా అలా నే ఉండేవి. షిరిడీ సాయి బాబాకు తాను ప్రతిరూపమని చెప్పుకొన్న సత్యసాయి.. అసలు పేరు సత్యనారా యణ రాజు. 12 ఏళ్ల నుంచే ఆయన ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారు. ఎక్కువగా మౌనం పాటించే వారు. తన వద్దకు ఎవరు వచ్చినా.. మౌనంగానే పలకరించేవారు.
అనంతర కాలంలో సత్యసాయి పేరు ప్రముఖంగా వినిపించడం ప్రారంభించింది. ఆయనలో మహిమలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన ఎప్పుడూ అలా చెప్పుకొనేవారు. కేవలం సేవ చేసేందుకు మాత్రమే తాను వచ్చానని తెలిపేవారు. ప్రశాంతమైన చిరునవ్వు.. అంతకుమించిన ఆదరణ వంటివి సత్యసాయి నిఘంటువులో కనిపించేవి. ఎక్కడ నుంచి ఎవరు ఏస్తాయి వరకు పుట్టపర్తి సాయి నిలయానికి వచ్చినా.. అక్కడ అందరూ సమానులే. అందరితోనూ కలిసి కూర్చోవాల్సిందే. అలా.. సత్యసాయి చుట్టూ అల్లుకున్న సేవా గుణం.. ప్రస్తుతం 130 దేశాల్లో అజరామరంగా విరాజిల్లుతోంది.