పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు, ప్రశాంతి నిలయం ఏర్పాటై 75 వసంతాలు పూర్తైన సందర్భం కూడా తోడవడంతో ఈ ఉత్సవాలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉత్సవాల్లో ఏపీ చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ నేడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలతో పాటు లవ్ ఆల్, సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనే సిద్ధాంతంతో సత్యసాయి బాబా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారని చంద్రబాబు అన్నారు.
డబ్బు, పదవి ఉన్నా లభించని ప్రశాంతత పుట్టపర్తిలో దొరుకుతుందని, అందుకే దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఆయన మార్గాన్ని అనుసరించారని చంద్రబాబు అన్నారు. ప్రశాంతి నిలయం ఒక గొప్ప ఎనర్జీ సెంటర్ అని తెలిపారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, తాగునీరు వంటి రంగాల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 102 పాఠశాలల ద్వారా 60 వేల మందికి ఉచిత విద్య, ఆసుపత్రుల ద్వారా రోజుకు 3 వేల మందికి ఉచిత వైద్యం అందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.550 కోట్లతో 1600 గ్రామాలకు తాగునీరు అందించారని, ఒక్క చెన్నై నగరానికే రూ.250 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.