మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలో లోకేశ్ ను నేరుగా కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే, లోకేశ్ ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల కోసం పుట్టపర్తిలో ఉన్నారు. అయితేనేం..ప్రజా సమస్యలు వినేందుకు అక్కడ కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు లోకేశ్. లోకేశ్ ను కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారి సమస్యలను విన్న లోకేశ్ వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతో తమపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని ఎత్తివేయాలని కొందరు లోకేశ్ ను ఆశ్రయించారు. తమ స్థలాలను వైసీపీ నేతల అండతో కొందరు కబ్జా చేశారని కొందరు ఫిర్యాదు చేశారు. వినతులన్నింటినీ పరిశీలించిన లోకేశ్...తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీనిచ్చారు.