కొన్ని నెలల కిందట మంచు వారి కుటుంబ గొడవ ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఆ గొడవ ఇంకా ఇంకా పెద్దది అవుతూ వెళ్లిందే తప్ప సద్దుమణగలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు కుటుంబంలో ఇలాంటి గొడవ రావడం.. మంచు విష్ణు, మంచు మనోజ్ అలా గొడవ పడడం ఎవ్వరికీ నచ్చలేదు. ఐతే కొన్ని నెలల తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు కనిపించాయి.
‘కన్నప్ప’ రిలీజ్ టైంలో తన అన్న గురించి మంచు మనోజ్ పాజిటివ్‌గా మాట్లాడ్డం.. తర్వాత మనోజ్ నటించిన ‘మిరాయ్’ సినిమాకు విషెస్ చెబుతూ విష్ణు పోస్ట్ పెట్టడంతో అన్నదమ్ములు కలిసిపోతున్నారనే అభిప్రాయం కలిగింది. వీళ్లిద్దరూ ముందులా కలిసిపోవడానికి ఒక మంచి సందర్భం వస్తే చాలని అంతా అనుకున్నారు. మోహన్ బాబు 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకే అందుకు వేదిక అవుతుందని అంతా భావించారు.
కానీ ఈ వేడుకలో భాగంగా సినీ, రాజకీయ ప్రముఖులకు ఇచ్చిన గ్రాండ్ పార్టీలో మంచు మనోజ్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మిగతా మంచు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో దర్శనమిచ్చారు. విష్ణునే దగ్గరుండి ఈ వేడుకను నిర్వహించాడు. మంచు లక్ష్మి ఈ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విష్ణు భార్యాపిల్లలు.. లక్ష్మి కూతురు.. మనోజ్ తల్లి.. ఇలా అందరూ ఉన్న ఈ వేడుకలో మనోజ్ మాత్రం కనిపించలేదు.
ఈ వేడుక మంచు కుటుంబానికి ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఇలాంటి మూమెంట్ కుటుంబంలో రాకపోవచ్చు. కానీ అలాంటి ఈవెంట్లో కూడా మనోజ్ కనిపించలేదంటే.. ఇంకా ప్యాచప్ జరగలేదని భావించాలి. తన తండ్రి సినీ స్వర్ణోత్సవ వేడుకలో తాను లేనందుకు మనోజ్ ఎంత బాధ పడుతుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఇదే సమయంలో ‘మోహన రాగ’ పేరుతో ఒక కొత్త మ్యూజిక్ కంపెనీకి శ్రీకారం చుట్టిన మనోజ్.. తన తండ్రి మీద తన గౌరవాన్ని చెప్పకనే చెప్పాడు. మరి తన చిన్న కొడుకును కుటుంబంలో కలుపుకోవడంలో మోహన్ బాబుకు ఇంకా ఏం ఇబ్బంది వస్తోందో?