బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇక లేరు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచిన వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. 89 సంవత్సరాల ఈ స్టార్ మరణవార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
ధర్మేంద్ర గత కొంత కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం ముంబైలోని క్యాండి ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వగా.. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి ఊహాగానాలు, సోషల్ మీడియా కథనాలు వరుసగా వచ్చాయి. వెంటిలేటర్‌పై ఉన్నారన్న వార్తలు కూడా వెలువడడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండిస్తూ ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, తాజాగా ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు తెలుస్తోంది.
పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ధర్మేంద్ర నివాసం వద్ద భారీగా జనసంద్రం ఏర్పడుతుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ధర్మేంద్ర అంటేనే భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. పంజాబ్ నుంచి వచ్చి ముంబైలో తన ప్రతిభతో ఎదిగిన ఆయన, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఏ జానర్‌లోనైనా తన ముద్ర వేసిన నటుడు. `షోలే`, `చుప్కే చుప్కే`, `సత్యం శివం సుందరం` లాంటి చిత్రాలు ఇప్పటికీ ఆయన నటనా వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి. ఆయన నటనలో ఉన్న సహజత్వం, మాటల్లో ఉన్న మాధుర్యం, వ్యక్తిత్వంలో ఉన్న వినయం… ఇవన్నీ ఆయనను సాధారణ నటుల దగ్గర వేరు చేశాయి. హిందీ సినీ చరిత్రలో నిలిచిపోయే చిరస్మరణీయ పేర్లలో ధర్మేంద్ర ఒకరు.ఆయన మరణం బాలీవుడ్‌కు మాత్రమే కాదు.. భారత సినిమా రంగానికి తిరుగులేని లోటు.