వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి షాక్ తగిలింది. తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసులో తాజాగా సీఐడీ అధికారులు భూమనకు నోటీసులు జారీ చేశారు. సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని స్పష్టమైన ఆదేశాలు రావడం భూమన వర్గాల్లో ఆందోళనను పెంచింది. 2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో రవి అనే ఉద్యోగి 920 అమెరికన్ డాలర్లను దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడిన ఘటన పెద్ద కలకలం రేపింది.
ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే కేసు విచారణపై ప్రారంభం నుంచే వచ్చిన విమర్శల నేపథ్యంలో హైకోర్టు నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. డిసెంబర్ 2లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని గడువు పెట్టడంతో సీఐడీ దర్యాప్తు వేగం పెరిగింది. డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు.
ఫిర్యాదు దారుడైన ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలోనే మృతి చెందడం కేసులోని అనుమానాలను మరింత పెంచింది. ఇక సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో అప్పటి వీజీవో గిరిధర్, ఏవీఎస్‌వో పద్మనాభాన్ని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. వారిద్దరి నుంచి పొందిన సమాచారంలో కొన్ని కీలక అంశాలు బయటకు రావడంతోనే సీఐడీ భూమనను విచారణకు పిలిచిందనే సమాచారం బయటకు వచ్చింది.
కాగా, తిరుమల పరకామణి డాలర్ల చోరీ కేసు సాదాసీదా నేరం కాకుండా ఇప్పుడు భారీ రాజకీయ పెను ముప్పుగా ఎదిగింది. భూమనకు వచ్చిన నోటీసులు ఈ దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలియజేస్తున్నాయి. ముందు మరిన్ని కీలక మలుపులు రావచ్చని.. మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.