కొన్ని సార్లు క్యాజువల్‌గా చేసే కామెంట్లు కూడా తీవ్ర వివాదానికి దారి తీస్తాయి. మరి మారుతి అలాగే కామెంట్ చేశాడా.. లేక తన ఉద్దేశం వేరేనా అన్నది తెలియదు కానీ.. ఆయన కామెంట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఆదివారం రాత్రి రాజాసాబ్ సినిమా నుంచి రెబల్ సాబ్ పాటను లాంచ్ చేసిన సందర్భంగా హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ఇచ్చిన స్పీచ్‌లో మారుతి ఒక కామెంట్ చేశాడు.
అభిమానులు ఈ సినిమాతో కాలర్ ఎగరేస్తారు లాంటి కామెంట్లు తాను చేయనని.. ప్రభాస్ కటౌట్‌కు అది చిన్న మాట అని మారుతి వ్యాఖ్యానించాడు. ఐతే ఈ కామెంట్ తారక్ అభిమానులకు గట్టిగా గుచ్చుకుంది. గత కొన్ని సినిమాల నుంచి తారక్.. ప్రి రిలీజ్ ఈవెంట్లలో అభిమానులు కాలర్ ఎగరేసేలా తన చిత్రం ఉంటుందని చెబుతూ వస్తున్నాడు. అది ఒక సిగ్నేచర్ మూమెంట్‌గా మారిపోయింది. దేవరకు అలాగే చేసి మాట నిలబెట్టుకున్నాడు. కానీ వార్-2 విషయంలో తేడా కొట్టింది. ఈ సినిమాకు తారక్ రెండు కాలర్లు ఎత్తగా.. ఆ ఫొటో వైరల్ అయింది. సినిమా డిజాస్టర్ అయింది.
ఐతే వార్-2 రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. కాలర్ ఎగరేయడాన్నితమ హీరోకు, తమకు మధ్య ఒక ఎమోషనల్ మూమెంట్‌గా తారక్ ఫ్యాన్స్ పరిగణిస్తున్న నేపథ్యంలో మారుతి కామెంట్ వారిని ఆగ్రహానికి గురి చేసింది. తమ హీరోను, తమను తక్కువ చేసేలా మాట్లాడాడంటూ అతడి మీద ఫైర్ అయిపోయారు. అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతుండడంతో మారుతి అప్రమత్తం అయ్యాడు. తన మీద హార్ష్ కామెంట్ చేసిన ఒక ఎన్టీఆర్ అభిమానికి వ్యక్తిగతంగా రిప్లై ఇచ్చాడు. అందరు అభిమానులకూ కలిపి అతను సారీ చెప్పాడు.
కొన్నిసార్లు యథాలాపంగా చేసే కామెంట్లలో కొన్ని మాటలు అనుకోకుండా దొర్లుతాయని.. కానీ ఆ ఉద్దేశం ఎంతమాత్రం ఉండదని.. నిన్నటి తన కామెంట్ అలాంటిదే అని మారుతి చెప్పాడు. ఎన్టీఆర్ మీద, ఆయన అభిమానుల మీద తనకెంతో గౌరవం ఉందని.. ఆయన మీద అభిమానులకు ఉన్న ప్రేమ ఎలాంటిదో తనకు తెలుసని మారుతి అన్నాడు. తాను నిజాయితీగా ఈ వివరణ ఇస్తున్నానని.. తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మారుతి కోరాడు. మరి ఇంతటితో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.