హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందా! రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందున్న పూర్వ స్థితి తిరిగి వస్తుందా! అంటే ఇప్పటికిప్పుడు ఆ స్థాయికి చేరుకోకపోయినా.. కొంత గాడిలో పడే అవకాశం మాత్రం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పదేళ్లపాటు బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశానికి చేరుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో నే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా పేరిట చేపట్టిన కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలింది. చివరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పోరాటం, న్యాయస్థానాల జోక్యంతో హైడ్రా కొంత వెనక్కి తగ్గింది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల వంటి అంశాలు కూడా హైడ్రా దూకుడుకు కళ్లెం వేయాల్సిన పరిస్థితిని కల్పించాయి. మొదట్లో ఎటువంటి హెచ్చరికలు , నోటీసులు లేకుండా నేరుగా వెళ్లి ఇళ్లను నేలమట్టం చేసిన హైడ్రా.. ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి అలాంటిది కూడా ఏమీ కనిపించడంలేదు. దీంతో ఇన్నాళ్ల తరువాత మళ్లీ రియల్ రంగానికి కాస్త బూస్ట్ వచ్చినట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నగరంలోని కీలక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించడానికి సిద్ధమైంది. ఇప్పటికే తుర్కయాంజాల్, బాచుపల్లి వంటి ప్రాంతాల్లోని ప్లాట్ల కోసం నోటిఫికేషన్లు జారీ చేసి, సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు తొలి విడత వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి వేలంలో ప్రత్యేకించి కోకాపేటలోని భూములు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎకరం భూమి రూ.100 కోట్లకు పైగా అమ్ముడుపోయిన రికార్డును ఈసారి తిరగరాస్తుందన్న చర్చ జరుగుతోంది.
తొలి విడతలో 82 ప్లాట్లు వేలానికి రానున్నాయి. ఇందులో తుర్కయాంజాల్ లేఅవుట్‌లో 12 ప్లాట్లు, బాచుపల్లి లేఅవుట్‌లో 70 ప్లాట్లు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మరికొన్ని ప్లాట్లను కూడాహెచ్ ఎండీఏ విక్రయించనుంది. తర్వాతి దశల్లో బైరామల్‌గూడ, పుప్పాలగూడ, చందానగర్, చెంగిచెర్ల, సూరారం, బౌరంపేట్ వంటి కీలకమైన ప్రాంతాల భూములను వేలం వేయనున్నారు.
కోకాపేట నియోపోలిస్.. మళ్లీ అదే డిమాండ్
గతంలో కోకాపేట నియోపోలిస్‌లో జరిగిన భూముల వేలం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక చదరపు గజం ధర రూ.1 లక్ష వరకు పలకగా, ఎకరం భూమి ఏకంగా రూ.100 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. ఈసారి కూడా కోకాపేటలోని సర్వే నంబర్ 144లో ఉన్న 8,591 గజాలు, సర్వే నంబర్ 146లో ఉన్న 1,400 గజాల భూములకు పెట్టుబడిదారుల నుండి భారీ డిమాండ్ ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటి విడత వేలం కోసం ఒక చదరపు గజానికి రూ.30,000 నుండి రూ.35,000 వరకు కనీస ధర ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోకాపేట, పుప్పాలగూడ వంటి ప్రధాన ప్రాంతాల్లో ధరలు ఈ బేస్ ప్రైస్ కన్నా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్నర్ ప్లాట్లకు ఎక్కువ పోటీ ఉంటుందని, బిడ్డర్లు భారీగా ధరలు పెంచే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.
పెట్టుబడిదారులకు సువర్ణావకాశం..
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్న నేపథ్యంలో ఈ వేలం పెట్టుబడిదారులకు ఒక మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన వంటి కారణాల వల్ల కోకాపేట, పుప్పాలగూడ, బాచుపల్లి లాంటి ప్రాంతాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఈ వేలం పాటలు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు హెచ్ ఎండీఏ అధికారులు తెలిపారు, ఇది పారదర్శకతను పెంచుతుంది. మొత్తంగా ఈసారి కోకాపేట భూముల వేలం గత రికార్డును తిరగరాస్తుందా లేదా అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేలం ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వేలం పూర్తయితే ఏడాదికి పైగా స్తబ్దుగా ఉన్న రియల్ రంగానికి మళ్లీ రెక్కలు వస్తాయని అంటున్నారు.