సభ్యత, సంస్కారాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏనాడో తిలోదకాలిచ్చేశారు. పెద్దా చిన్నా తారతమ్యం ఆయనకు మొదటి నుంచీ లేదు. సొంత తల్లిని, చెల్లినే మెడపట్టి గెంటేసిన వ్యక్తి.. పరాయివారికి మర్యాద ఇస్తారనుకోవడం పొరపాటే అవుతుంది. ఆయన వయసు 52 ఏళ్లు.. నిత్య యవ్వనంతో స్థిరస్థాయిగా ఇలాగే మిగిలిపోతాననుకుంటున్నారాయన. సీఎం చంద్రబాబు మాత్రం రేపోమాపో చనిపోతారంటూ నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నారు! ప్రజాస్వామికంగా అధికార కూటమిని ఎదుర్కోలేక దాని సారథి చావు కోరుకోవడమేంటో!
జగన్‌ను ఆదర్శంగా తీసుకుని ఆయన ముఠా కూడా 75 ఏళ్లు దాటేసిన చంద్రబాబు ఇంకెంత కాలం బతుకుతాడంటూ సెటైర్లు వేయడం.. అవి విని జగన్ అమితానందం పొందడం. తన తండ్రికి సమకాలికుడైన చంద్రబాబు చనిపోవాలని కోరుకోవడమేంటి? ఆయనపై ఎందుకంత ద్వేషమో అర్థం కాదు. తనను జైలుకు పంపింది సొంత పార్టీ కాంగ్రెస్ అధిష్ఠానమైతే.. చంద్రబాబుపై కక్ష పెంచుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లకుపైగా అవినీతి సొమ్ము ఆర్జించిన ఆయన.. గద్దెనెక్కిన ఐదేళ్లలో ఎంత దోచుకున్నారో లెక్కే లేదు. ఒక్కో కుంభకోణం బయటకు వస్తోంది.
తాజాగా మద్యం స్కాం తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరడంతో జగన్‌కు కాళ్లూ చేతులూ ఆడడం లేదు. అక్రమాస్తుల కేసులో 16 నెలలు చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయన.. తన సన్నిహితుడైన ఎంపీ మిథున్‌రెడ్డి కూడా జైలు పాలుకావడంతో మద్యం కేసులో తనకూ మఠప్రవేశం తప్పదని బెంబేలెత్తుతున్నారు. అందుకే కనీస మర్యాద కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయానికి ప్రజలనే నిందించిన జగన్.. ఇప్పుడు తన కుటుంబ కంచుకోటైన సొంత నియోజకవర్గం పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికలో మరింత దారుణంగా ఓడిపోవడం తట్టుకోలేకపోతున్నారు. మతిస్థిమితం తప్పినవాడిలా మాట్లాడుతున్నారు.
పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల వారిని కనీసం నామినేషన్ కూడా వేయనివ్వని వ్యక్తి.. ఎన్నికల అక్రమాల గురించి ఉపన్యాసాలు దంచుతున్నారు. వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని మోదీకి కూడా 75 ఏళ్లు వచ్చాయి. మరి ఆయన విషయంలో కూడా జగన్ ఇదేమాట అనగలరా? ఎందుకింత దురహంకారం?
ఘోర పరాజయం..
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజలు మొదటిసారి ధైర్యంగా వచ్చి ఓటు వేశారు. గతంలో అక్కడ ఏ స్థానిక ఎన్నిక జరిగినా ఏకగ్రీవాలే. ఎవరూ కనీసం నామినేషన్ వేసే సాహసం కూడా చేసేవారు కాదు. వైఎస్ కుటుంబం ఎవరిని నిలబెడితే వారే ఇక్కడ సర్పంచ్‌లు.. ఎంపీటీసీలు.. జడ్పీటీసీలు.. ఎవరైనా వారు పెట్టే బొమ్మలే. కానీ ఈసారి చిన్న ఉప ఎన్నికలో 11 మంది నామినేషన్లు వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారు. తమకు అలవాటైన రిగ్గింగ్‌కు అంతా సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రౌడీషీటర్లను ఎక్కడికక్కడ బైండోవర్ చేశారు. బయటి నుంచి వచ్చిన అన్ని పార్టీల నేతలనూ పోలింగ్ తేదీకి ముందే పంపించివేశారు. రిగ్గింగ్‌లో సిద్ధహస్తులైన ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని, ఇతర వైసీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భర్త బీటెక్ రవిని కూడా హౌస్ అరెస్టుచేశారు.
స్వేచ్ఛగా ఓటేవేసే పరిస్థితి నెలకొనడంతో పులివెందులతో ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. జగన్ అడ్డా పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఒంటిమిట్టలో ఘోర ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంది. ఈ రెండు చోట్లా తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. పులివెందులలో వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా, 7,794 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో లతారెడ్డికి 6,716 ఓట్లు పోల్ అయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. జగన్ ఏడవడానికి ఇదే ప్రధాన కారణం.
అటు ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్ధి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి... వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 20,467 ఓట్లకు గాను 19,836 ఓట్లు చెల్లాయి. వీటిలో టీడీపీకి 12,780 రాగా వైసీపీకి 6,513 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలతో జగన్‌కు భవిష్యత్ అర్థమైనట్లుంది. అందుకే తన నీలి, కూలి మీడియాను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని.. చంద్రబాబును, పోలీసులను టార్గెట్ చేస్తూ దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదన్నారు. పులివెందులలో 15 బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించారని.. పోలీసుల సమక్షంలో వారి ప్రోద్బలంతోనే టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని అన్నారు.
అయితే ఆయన చెప్పిన పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలే బయటకు తరిమేసి చితకబాదారు. పోలీసులు రావడంతో పరారయ్యారు. వైసీపీ నేతలు కొడుతున్న ఫొటోలను చూపి వాళ్లు టీడీపీ వాళ్లంటూ జగన్ అబద్ధమాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని ఆరోపించారు. డీఐజీ వ్యవస్థ మాఫియా ముఠాలా పనిచేస్తుందంటూ మరోసారి జగన్ నోరుపారేసుకున్నారు. మద్యం అమ్మకాలు, బెల్టుషాపులు, మట్టి మాఫియా, క్వార్జ్, ఇసుక తవ్వకాల వంటి వాటిలో పర్సంటేజీలు వసూలు చేస్తూ పెద్దబాబు చంద్రబాబు, చిన్నబాబు లోకేశ్‌కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ డీఐజీల పర్యవేక్షణలోని పోలీసు అధికారులు నెలవారీ వాటాలు పంచుతున్నారని నోటికొచ్చినట్లు వదిరారు.
ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. జడ్పీటీసీ వరకే ఎందుకు.. ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఇక్కడా ఉప ఎన్నిక వస్తుంది. ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవచ్చుగా! ఎలాగూ ఆయన సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. దీనికి మాత్రం ఆయన సిద్ధంగా లేరు. చంద్రబాబుకు నచ్చిన పోలీసు అధికారులను ఎంపిక చేసి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల డ్యూటీల్లో వేశారని జగన్ అన్నారు. ‘కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి మోహనరావుకు అల్లుడవుతారు. 75 ఏళ్లు దాటిన ముసలి వయసులో చంద్రబాబుకు ఇలాంటి ఎన్నికలు అవసరమా? ఈ కక్షలూ కార్పణ్యాలు, దుర్మార్గాలు ఆయనకు కచ్చితంగా చుట్టుకుంటాయి.
ముఖ్యమంత్రిగా ఉన్నావ్.. నీ జీవితానికి బహుశా ఇదే ఆఖరి ఎలక్షన్ కావొచ్చు. రామా కృష్ణా అనుకునే ఈ వయస్సులో కనీసం ఆ మాటలైనా అనుకుంటే పుణ్యమైనా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ’ అని శాపనార్ధాలు పెట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏమైనా నిజాయితీ పరుడా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి, చంద్రబాబు హాట్‌లైన్‌లో మాట్లాడుకుంటారని ఆరోపించారు. అందుకే ఏపీలో దొంగ ఓట్లపై రాహుల్ మాట్లాడడన్నారు. రాష్ట్రంలో జరిగే కుంభకోణాలపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ నోరెత్తడని, తనను మాత్రం మాణిక్కం నీచంగా తిడతాడని మండిపడ్డారు. ‘చంద్రబాబును ఎవరూ లీడర్ అనరు.. ఫ్రాడ్‌స్టర్ అంటారు.
పచ్చచొక్కాలు వేసుకున్న పోలీసులు ప్రజాభద్రత కోసం కాకుండా ప్రజలను భయభ్రాంతులను గురిచేసేందుకు డ్యూటీ చేశారు. ఒక్కో ఓటరుకు ఒక్కొక్క రౌడీషీటరును ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చెలరేగారు.. నా పులివెందులలో జమ్మలమడుగుకు చెందినవాళ్లు దొంగ ఓట్లు వేసుకున్నారు. జిల్లా కలెక్టరు శ్రీధర్ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని చూశాడు’ అని అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబుకు ప్రజలు ఓటు వేయరని తెలుసుకాబట్టే ఈ దౌర్జన్యాలు చేశారని.. ప్రజాసామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ఓట్లు వేస్తారని సూక్తులు వల్లించారు. ఇప్పటికే కన్నుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర అయిపోయిందని.. మరో మూడున్నరేళ్లు కూడా ఇలాగే కన్నుమూసి తెరిచేలోగా అయిపోతాయి.. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు రాకుండా పోతాయి’ అని జోస్యం చెప్పారు.
తిరుపతి అరాచకం మరిచారా?
వైఎస్ ఫ్యామిలీ అడ్డా పులివెందులలో స్వేచ్ఛగా ఓటువేయడం మూడు దశాబ్దాల్లో ఇదే తమకు మొదటిసారి అని ప్రజలు మీడియా ముందుకొచ్చి మరీ చెప్పారు. అయితే, ఓటర్లను టీడీపీ నేతలు, పోలీసులు ఓటు వేసుకోనీయకుండా భయభ్రాంతులకు గురిచేశారంటూ జగన్ సెలవిచ్చారు. అక్కడ ఇంతకుముందేదో ప్రజాస్వామ్యం ఉన్నట్టు.. ఈ ఎన్నికల తర్వాత అది మంటగలిసిపోయినట్టు ఆయన అల్లుతున్న కథలు విని పులివెందుల చరిత్ర తెలిసినవారు విస్తుపోతున్నారు. ‘‘తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ సాగించిన అరాచకం మరిచారా.. ఓ ఐఏఎస్‌ను నాడు బలి చేశారు కదా..’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
నిజానికి, పులివెందులలో గడచిన 30 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నడిచింది రాజారెడ్డి రాజ్యాంగమే. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నామినేషన్లను పులివెందులలో వేయనిచ్చేవారు కాదు. దీంతో ఏనాడూ అక్కడ ఎన్నికలు జరగలేదు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు ఉప ఎన్నికల ప్రకటన వెలువడినప్పుడు అదే గత సంప్రదాయం నడిచిపోతుందని జగన్ బ్యాచ్, వైసీపీ నేతలు భావించారు. కానీ ఆగస్టు 12వ తేదీన జరిగిన ఎన్నికలు వారి అంచనాలను తలకిందులు చేశాయి. ఓటు స్వేచ్ఛను పొందిన అనుభూతితో పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇన్నాళ్లకు.. తమకు ఓటు వేసుకునే హక్కును కల్పించారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులను వేశారు. ఓటర్లలోని గూడుకట్టుకున్న ఆవేదనకు ఈ స్లిప్పులే నిదర్శనంగా నిలిచాయి.
బ్యాలెట్ బరిలోనూ చిత్తు..
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన జగన్.. ఈవీఎంలపై నిందమోపి ప్రచారం చేశారు. మరి పులివెందుల , ఒంటిమిట్ట ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరిగాయి. కానీ, జగన్ బలపరచిన అభ్యర్ధులు రెండు చోట్లా ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాల పేరిట .. నాడు అధికారపక్షానికి చెందిన ఒకే నామినేషన్ పడేలా వ్యూహాన్ని అమలుచేశారు. తెలుగుదేశం,జనసేన, వామపక్షాల నుంచి ఎవరైన నామినేషన్ వేసేందుకు వెళితే, వారి పత్రాలను దౌర్జన్యంగా లాక్కొని చించేశారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ అరాచకం పరాకాష్ఠను అందుకుంది. భారీగా రిగ్గింగు .. దొంగ ఓట్లను వేశారు.
తిరుపతి లోక్‌సభకు 2021లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు ఎన్నికల సందర్భంగా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి పర్యవేక్షణలో దొంగ ఓట్లు గుద్దుకున్నారు. తమిళనాడు నుంచి కూలీలను బస్సుల్లో తీసుకు వచ్చి ఓట్లు వేయించారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువురాని వారిని.. కేవలం ఐదో తరగతి చదువుకున్నవారిని, రోజువారి కూలీలను తరలించుకువచ్చి బహిరంగంగా దొంగ ఓట్లు వేయించారు.
ఈ క్రమంలో ఏకంగా మునిసిపల్ కమిషనర్ గిరీశా ఎలక్ర్టానిక్ సిగ్నేచర్‌ను వైసీపీ వాడేసింది. ఈసీ జరిపిన ప్రాథమిక విచారణలో ఆ విషయం ఆ తర్వాత బయటపడింది. గిరీశాపై వేటు పడింది. అయితే, గిరీశా తప్పులేదని .. ఆయన డిజిటల్ సిగ్నేచర్‌ను వైసీపీ మూక కొట్టేసిందని తెలియడంతో ఆయన సస్పెన్షన్‌ను ఎత్తేశారు.