ఏపీలో మరిన్ని కొత్త జిల్లాల కోసం చాలాకాలంగా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, భౌగోళికపరంగా, సరిహద్దులపరంగా, పాలనా పరంగా వెసులుబాటు చూసుకొని కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అడ్డదిడ్డంగా జిల్లాలను ఏర్పాటు చేయడంపై చాలాచోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్లపై నిశితమైన పరిశీలన చేసిన తర్వాత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుపై మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై చంద్రబాబు రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించారు. కొన్ని మార్పులుచేర్పులతో ఆ ప్రతిపాదనలను చంద్రబాబు అంగీకరించారు. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి చేరనుంది.పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. దీంతోపాటు, రెవెన్యూ వ్యవస్థలోనూ మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా), అద్దంకి (ప్రకాశం జిల్లా), పీలేరు (మదనపల్లె జిల్లా), బనగానపల్లె (నంద్యాల జిల్లా), మడకశిర (సత్యసాయి జిల్లా) రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఇక, కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివనాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా చంద్రబాబు ఓకే చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పరిపాలనా అవసరాల దృష్ట్య మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. త్వరలోనే కొత్త ఆఫీసుల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపట్టనున్నారు.