తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 29న ప్రకటించిన నోటిఫికేషన్ రద్దయింది. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల వ్యవహారాన్ని పక్కనబెట్టి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నేడు విడుదల చేశారు. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నామని మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుందని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు.
తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు... రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు... మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మొత్తం1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లున్నారని తెలిపారు. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 27 నుంచి, రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.