రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అమరావతిలో ప్రత్యేకంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరై విద్యార్థులను అభినందించారు. నిజమైన అసెంబ్లీ మాదిరే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలుగా విద్యార్థులు వ్యవహరించారు.
ఈ మాక్ అసెంబ్లీ లో విద్యార్థులు అధికార, ప్రతిపక్ష సభ్యుల పాత్రను పోషించి, సమకాలీన రాజకీయ అంశాలపై వాదోపవాదాలను ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలతో పాటు పలు చర్చలు ఆసక్తికరంగా సాగాయి. కొంతమంది ప్రజా ప్రతినిధులు గౌరవ సభల్లో ప్రవర్తిస్తున్న తీరును విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతిపక్ష వర్గాల మధ్య బిగ్ డిబేట్ జరిగింది. ఒకానొక దశలో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడం, స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ కొందరు సభ్యులను ఎత్తుకొని బయటకు వేసేయడం వంటి సన్నివేశాలు సభను రక్తికట్టించారు.
అయితే పిల్లలతో శాసనసభ ఏర్పాటు చేయాలన్న ఆలోచన నారా లోకేష్‌దే. కొద్ది రోజుల క్రితం విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి అనుమతి తీసుకున్న లోకేష్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డ స్టూడెంట్స్ కు శిక్షణ కూడా ఇచ్చారు. కట్ చేస్తే ఈ రోజు నిర్వహించిన స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ సూపర్ సక్సెస్ అయింది. మొత్తం 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో పిల్లలతో అసెంబ్లీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు జాతీయ, రాష్ట్రస్థాయి నుంచి లోకేష్‌కు ప్రశంసలు వస్తున్నాయి. ప్రజల్లోనూ మంచి స్పందన వచ్చింది. మాక్ అసెంబ్లీ ద్వారా పిల్లలకు ప్రతిభ చూపే, సమకాలీన రాజకీయాలు అర్థమయ్యే అవకాశాన్ని ప్రభుత్వం సృష్టించిందని విశ్లేషకులు అభినందిస్తున్నారు.
ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేల సభకు హాజరు కాని నిర్ణయం మరోసారి ప్రజల్లో చర్చకు వచ్చింది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి 18 నెలలుగా సభలో గైర్హాజరు కొనసాగిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిపక్ష నేతలు సభకు హాజరు కాకపోవడం అనేది ఏపీలోనే కొనసాగుతోంది. అయితే దానికి కనువిప్పు కలిగేలా విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోంది.