హైదరాబాద్–చెన్నై మధ్య ప్రయాణం ఇక పూర్తిగా మారబోతుంది. దాదాపు 12 గంటలు పట్టే ఈ దీర్ఘ రైలు ప్రయాణం భవిష్యత్తులో కేవలం 2.20 గంటలకు చేరుకోనుంది. తిరుపతి రూట్‌గా బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతుంది. దక్షిణ మధ్య రైల్వే తాజాగా తుది అలైన్‌మెంట్ నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ హైస్పీడ్ రూట్ అమలు మరింత దగ్గరైంది. ముఖ్యంగా ఈ మార్గం తిరుపతి మీదుగా సాగడం, ఏపీ–తెలంగాణ ప్రయాణికులకు భారీగా లాభం చేకూరనుంది.
మొదట గూడూరు మీదుగా వెళ్ళేలా ఉన్న ప్రణాళికను తమిళనాడు ప్రభుత్వ కోరిక మేరకు మార్చారు. దీంతో తిరుపతి–రేణిగుంట ప్రాంతానికి హైస్పీడ్ కనెక్టివిటీ లభిస్తోంది. ఈ మార్పు వల్ల శ్రీశైల దర్శన ప్రయాణికులు, స్థానిక ప్రజలు, టూరిస్టులకు మరింత వేగవంతమైన సేవలు అందే అవకాశముంది. తమిళనాడు పరిధిలో బుల్లెట్ రైలు కోసం చెన్నై సెంట్రల్, చెన్నై రింగ్ రోడ్ స్టేషన్ అనే రెండు స్టేషన్లు ప్రతిపాదించారు. ప్రతి స్టేషన్ చుట్టూ దాదాపు 50 ఎకరాల స్థలం అవసరమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాణిజ్య, రవాణా సౌలభ్యం కోసం ఈ స్పేస్‌ను ముందుగానే ఖరారు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.
తమిళనాడు పరిధిలో సుమారు 12 కి.మీ.ల టన్నెల్ నిర్మాణం ప్రణాళికలో ఉంది. ఇది హైస్పీడ్ రైల్వే నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన భాగంగా భావిస్తున్నారు. అయితే, రైల్వే అధికారులు ఇప్పటికే సాంకేతిక అంచనాలు పూర్తి చేసి, సొరంగ మార్గం కోసం అవసరమైన భూ ప్రదేశాలను గుర్తించారు. అలాగే ఈ ప్రాజెక్టుకు మొత్తం 223.44 హెక్టార్ల భూమి అవసరం. ముఖ్యంగా ఇందులో అటవీ భూమి ఏదీ లేకపోవడం ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. భూసేకరణలో ఇబ్బందులు తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.ఈ మార్గం మొత్తం 65 రోడ్లు, 21 హైటెన్షన్ లైన్ల మీదుగా వెళ్లనుంది.
సర్కారీ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ చేసిన విస్తృత సర్వేల ఆధారంగా ఈ అలైన్‌మెంట్‌ను ఫైనల్ చేశారు. భౌగోళిక పరిస్థితులు, భవిష్యత్ నగరాభివృద్ధి, సాంకేతిక ఆంక్షలు, పర్యావరణ అంశాలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ రూట్ అత్యంత ప్రయోజనకరంగా ఏర్పడింది. ఇకపోతే దక్షిణాదిలో ప్రణాళికలో ఉన్న రెండు హైస్పీడ్ రూట్లలో హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ కారిడార్ ఒకటి కాగా.. హైదరాబాద్–బెంగళూరు కారిడార్ మరొకటి. రాబోయే దశల్లో ఈ రూట్లు సౌతిండియాలో ఇంటర్‌సిటీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి.