2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించేందుకు అమెరికాతోపాటు పలు దేశాలలోని ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రవాసాంధ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు లోకేశ్ డల్లాస్ వెళ్లనున్నారు. డిసెంబరు 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డల్లాస్ లో జరిగే ఈ ధన్యవాద సభకు అమెరికాలో నివసించే ప్రవాసాంధ్రులంతా సకుటుంబ సపరివార సమేతంగా హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రతి వ్యక్తితో లేదా ప్రతి కుటుంబంతో లోకేశ్ ప్రత్యేకంగా ఫొటో దిగుతారు.
ఈ క్రమంలోనే ఈ ధన్యవాద సభను విజయవంతం చేసేందుకు ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు పెట్టుబడుల సలహాదారు డాక్టర్ రవి వేమూరి అమెరికాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో అతి భారీ కార్యక్రమంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఈ ఈవెంట్ ను జరిపేందుకు సన్నాహాలు మొదలుబెట్టారు. అమెరికా నలుమూలల నుంచి ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదేదో రాజకీయ సభలా కాకుండా అమెరికాలోని తెలుగు ప్రజలు ఒక చోట చేరి జరుపుకునే ఈ ఆత్మీయ సమ్మేళనం అని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు ప్రతీకగా జరగబోయే ఈ సభకు సంస్థలతో సంబంధం లేకుండా, అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రతి కుటుంబం హాజరుకావాలని కోరుతున్నారు. ఆ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ప్రదర్శనలు ఉండబోతున్నాయి. ఆహూతులందరికీ రుచికరమైన అచ్చ తెలుగు విందు భోజనం, వినోదం ఉంటుంది. ఈ ధన్యవాద సభలో పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు, ఐటీ కంపెనీల సీఈవోలతో కూడా లోకేశ్ భేటీ అయ్యే అవకాశముందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కంటే భారీ పెట్టుబడులు ఏపీకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.