ఏ దేశమైనా.. రాష్ట్రమైనా.. విద్యావంతులు ఉంటేనే ముందడుగు వేస్తుంది. ప్రజలు ఎంతోకొంత చదువుకుంటేనే మంచీ చెడూ బేరీజు వేయగలుగుతారు. తమకు ఎవరు మేలు చేకూరుస్తారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం చదివారో, ఎక్కడ చదివారో తెలియని వైసీసీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించారు. మిడిమిడి జ్ఞానంతో,పనికిమాలన సలహాదారుల చచ్చు సలహాలతో వయోజన విద్యకు తిలోదకాలిచ్చారు. ఫలితంగా అక్షరాస్యతలో నవ్యాంధ్ర వెనకబడిపోవడమే గాక.. దేశంలోనే అట్టడుగున నిలిచింది. వెనకబడిన రాష్ర్టాలుగా భావించే బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ సైతం ఏపీ కంటే ముందున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఏకంగా 1,20,68,709 మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారని తేలింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడే.. 2024 ఫిబ్రవరిలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. వయోజన విద్యను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఈ సంఖ్య ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణమైంది. దీంతో టీడీపీ కూటమి గెలిచి చంద్రబాబు సీఎం కాగానే వయోజన విద్యపై మళ్లీ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా మాతృభాషలో చదవడం, రాయగలగడం లక్ష్యంగా అక్షరాంధ్ర అనేక కొత్త కార్యక్రమానికి నాందిపలికారు. 2025-26లో 25లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
77శాతమే అక్షరాస్యత
నవ్యాంధ్ర జనాభా 5.25 కోట్ల మంది. వీరిలో చదువుకున్నవారి సంఖ్య 4.04 కోట్లు. మిగతా 1.2 కోట్ల మందికి మాతృభాషలో చదవడం, రాయడం రాదు. వీరిలో 15-59 ఏళ్ల వయస్కులు 81.14 లక్షల మంది ఉంటే.. 59ఏళ్లు దాటిన వారు 39.54 లక్షల మంది వరకు ఉన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 7.38 లక్షల మంది, అనంతపురం-6.0 9లక్షలు, పల్నాడులో 6.09 లక్షల మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు. అత్యల్పంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 2.90లక్షల మంది, అంబేద్కర్ కోనసీమలో 2.97 లక్షల మంది నిరక్ష్యరాస్యులు ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో 96.71 లక్షల మంది నిరక్ష్యరాస్యులుంటే.. పట్టణాల్లో 23.97 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే మహిళల్లో ఎక్కువ మంది చదువుని రాని వారున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 58.01 లక్షలు కాగా.. 38.69లక్షల మంది పురుషులకు చదువు లేదు. పట్టణాల్లో 15.32 లక్షల మంది మహిళలు, 8.64 లక్షల మంది పురుషులు నిరక్ష్యరాస్యులుగా ఉన్నారు.
జగన్ సర్కారు నిర్లక్ష్యం
జగన్ ప్రభుత్వం వయోజనుల్లో అక్షరాస్యత పెంచే కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో కోటి మందికిపైగా నిరక్ష్యరాస్యులున్నా వారిని అక్షరాస్యులుగా మార్చాలన్న లక్ష్యాన్ని అటకెక్కించింది. ఏదో మొక్కుబడిగా ఐదేళ్ల కాలంలో కేవలం 3 లక్షల మందినే అక్షరాస్యులుగా మార్చారు. ఫలితంగా దేశంలోనే నవ్యాంధ్ర చివరన నిలిచిందని 2023-24లో నిర్వహించిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వేలో తేలింది. అప్పటికి మిజోరం రాష్ట్రం అత్యధికంగా 98.2 శాతంతో అగ్రస్థానంలో నిలిస్తే, 72.6 శాతంతో ఏపీ చిట్టచివరన ఉండిపోయింది.
మనకంటే ముందు 74.3 శాతంతో బిహార్, 75.2 శాతంతో మధ్యప్రదేశ్, 75.8శ ాతంతో రాజస్థాన్ ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం 2024-25లో వచ్చీ రాగానే వయోజనులకు విద్యాశిక్షణ మొదలుపెట్టింది. తొమ్మి నెలల్లో 3.95 లక్షల మంది వయోజనులకు శిక్షణ ఇచ్చి, 3.53 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం 15-59 ఏళ్ల వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అక్షరాంధ్ర’ అనే కొత్త కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకం ‘ఉల్లాస్’తో కలిసి దీనిని చేపడుతోంది.
ఇందులో భాగంగా 2025-26లో 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యం విధించుకుంది. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, ఇతర వలంటీర్ల సహకారంతో వయోజనులకు వంద గంటల పాటు.. చదవడం, రాయడం, డిజిటల్ లిటరసీపై వారికి శిక్షణ ఇస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, మార్చిలో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఇందుకోసం వయోజన విద్యా విభాగం పుస్తకాల ముద్రణకు టెండర్లు పిలిచింది. ఎక్కువ మందిని అక్షరాస్యులుగా మార్చిన వారికి ప్రోత్సాహకాలివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. చదవడం- వర్ణమాల, సరళమైన పదాలు, వాక్యాలు, చిత్రాలను చూసి పదాలు గుర్తించడం ఉంటాయి.
రాయడం- తెలుగు అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతాలు, చిన్న వాక్యాలు నేర్పిస్తారు. న్యూమరసీ- వెయ్యి వరకు అంకెలు నేర్పిస్తారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు ఉంటాయి. అలాగే కిలోలు, లీటర్లు, మీటర్ల లాంటి కొలతలపై అవగాహన కల్పిస్తారు. డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ- గడియారం, క్యాలెండర్ చూసి అర్థం చేసుకోవడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో డిజిటల్ అంకెలను గుర్తించడం, బ్యాంక్ ఫామ్‌లు నింపడం, ఏటీఎంలను వినియోగించడం నేర్పిస్తారు.
బాక్సుగా..
రెండో తరగతి పాఠ్యపుస్తకాలూ చదవలేరు
లెక్కలు చేయలేరు.. ఎక్కాలు అసలే రావు
3 నుంచి 8వ తరగతి వరకూ ఇదే దుస్థితి
‘ఒక చెరువు పక్కన పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి గూడు కట్టుకుంది. ఆ గూట్లో కాకి తన పిల్లలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేది’... ఇలాంటి సరళమైన పదాలతో ఉన్న రెండో తరగతి స్థాయి తెలుగు పాఠాన్ని కూడా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థుల్లో 44 శాతం మంది తప్పుల్లేకుండా చదవలేకపోతున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో కేవలం 15.5 శాతం మంది, ఐదో తరగతి పిల్లలు 37.7 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాన్ని చదవగలుతున్నారు. మిగిలిన వారంతా అక్షరాలు కూడా సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్(అసర్)-2024 నివేదిక వెల్లడించిన వాస్తవాలివి.
ఇక ఆరో తరగతి విద్యార్థుల్లో 48 శాతం మందికే భాషా సబ్జెక్టులపై అవగాహన ఉంది. గణితంపై 41శాతం మందికి, పర్యావరణ సైన్స్‌పై 40శాతం మందికి మాత్రమే పట్టు ఉంది. మొత్తంగా మూడో తరగతి భాషా సబ్జెక్టులు, గణితం మినహాయిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉందని పరఖ్ రాష్ర్టీయ సర్వేక్షన్ (నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే)-2024 స్పష్టం చేసింది. ఈ రెండు నివేదికలు పరిశీలిస్తే నవ్యాంధ్రలో ప్రాథమిక విద్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతోంది.
ఈ సర్వేలను సమీక్షించిన పాఠశాల విద్యాశాఖ.. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటిని అధిగమించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలను సిలబస్‌పై కాకుండా ప్రాథమిక అంశాలపైనే నిర్వహించాలని నిర్ణయించింది.
మెగా పీటీఎంలో 1.29 కోట్ల మంది భాగస్వామ్యం
పిల్లల భవిష్యత్ విద్యతో ముడిపడి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన విద్యాసంస్కరణలతో పాఠశాలల్లో విద్యాబోధన, పిల్లల్లో విజ్ఞానం, జిజ్ఞాస ఏ మేరకు పెరుగుతున్నాయి.. వాటిపై తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలేంటో ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు విద్యామంత్రి లోకేశ్ వినూత్నంగా రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. 52 లక్షల మంది తల్లిదండ్రులు, 5.64 లక్షల మంది మేనేజ్‌మెంట్ కమిటీల సభ్యులు, 66 వేల మంది పూర్వ విద్యార్థులు, 50 లక్షల మంది విద్యార్థులు.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 1.29 కోట్ల మంది మెగా పీటీఎం 2.0లో భాగస్వాములయ్యారు.
ఇంతమంది ఒకేరోజున పేరెంట్-టీచర్స్ సమావేశాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. దీంతో గిన్నిస్ బుక్ రికార్డు కోసం పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మెగా పీటీఎంకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో రెండుసార్లు మెగా పీటీఎం నిర్వహించాలని నిర్ణయించారు.