మంత్రి నారా లోకేష్ ఐడియాలు అద్భుతః అన్నట్టు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం విద్యాశాఖతో పాటు ఇతర శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్.. తాజాగా గత మూడు రోజులుగా నిర్వహి స్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విద్యార్థుల కోణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తటస్థుల నుంచి అన్ని వర్గాల వరకు నారా లోకేష్‌ను అభినందిస్తున్నారు.
రెండు రోజుల కిందట విజయవాడలో `విలువల విద్య` అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థు లకు దిశానిర్దేశం చేసేలా ప్రభుత్వ సలహాదారు.. ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును ఆహ్వానించి దా దాపు 3 గంటలకు పైగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎలా ఉండాలి ? ఏం చేయాలి? ఎలా చదవాలి? భవిష్యత్తు ఏంటి? ఇలా అనేక విషయాలు చర్చించారు. వారికి అవగాహన కల్పించారు.
కట్ చేస్తే.. తాజాగా బుధవారం మరో వినూత్న కార్యక్రమంలో నారా లోకేష్ అందరినీ ఆకట్టుకున్నారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క విద్యార్థిని ఎంపిక చేసి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాస్తవ అసెంబ్లీ ఎలా అయితే.. నిర్వహిస్తారో.. అచ్చంగా అలానే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సహా.. మంత్రులు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ముందు భాగంగా ప్రత్యేకంగా వేసిన శాసన సభ సెట్‌లో సుమారు 2 గంటల పాటు విద్యార్థులే ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లుగా వ్యవహరించి.. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతోపాటు.. ప్రజాప్రతినిధి బాధ్యతలు, ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశం ఉందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇక, ఈ కార్యక్రమానికి 8-9-10 తరగతుల విద్యార్థులను మాత్రమే ఎంపిక చేశారు.