మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం తమ ప్రత్యర్థుల్ని ఎంత దారుణంగా విమర్శలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు హద్దులు దాటేస్తూ.. అనవసర రచ్చకు కారణమవుతుంటాయి. ఈ తీరుకు భిన్నంగా కొన్నిసార్లు సీరియస్ అంశాల్ని మాట్లాడుకునే వేళలో.. రాజకీయ నేతలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తారు. ప్రత్యర్థుల గొప్పతనాన్ని ప్రస్తావించటం ఇక్కడ ఆసక్తికకర అంశం. తాజాగా అలాంటి విషయాన్నే షేర్ చేసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాను ఒకే పార్టీ నుంచి ఏడుసార్లు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అన్న ఆయన.. మరో ఆసక్తికరఅంశాన్ని ప్రస్తావించారు. తనకంటే ఎక్కువసార్లు గెలిచింది మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గా చెప్పిన ఆయన.. ఆ తర్వాత తానే సీనియర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
కాకుంటే తనకు.. కేసీఆర్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ప్రస్తావించారు. కేసీఆర్ పలు పార్టీల నుంచి గెలిస్తే.. తాను మాత్రం మొదట్నించి కాంగ్రెస్ పార్టీ తరఫునే ఎన్నికల్లో విజయం సాధించినట్లు చెప్పారు. అంతేకాదు.. కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతే.. తాను మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదని చెప్పారు. కోదాడలో జరిగింది లాకప్ డెత్ కాదన్న ఆయన.. మరణించిన వ్యక్తి మీద సీఎంఆర్ఫీఎఫ్ చెక్స్ ఫ్రాడ్ కేసు ఉందని చెప్పారు. తన గొప్పతనాన్ని కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి చెప్పిన ఉత్తమ్ వైనం ఆసక్తికకరంగా మారిందని చెప్పక తప్పదు.