రాజధాని అమరావతిలోని వెంకటపాలెం ప్రాంతం ఇప్పుడు ఒక పెద్ద చరిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యం కాబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ అభివృద్ధి, విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, టీటీడీ ఛైర్మన్, పలువురు ఎమ్మెల్యేలు, భక్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మొత్తం రూ.260 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులకు చంద్రబాబు చేతుల మీదగా భూమిపూజ ఘనంగా జరిగింది. విస్తరణ ప్రణాళిక ప్రకారం, తొలి దశలో రూ.140 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, ఏడంతస్తుల మహారాజగోపురం, వివిధ మండపాలు, పుష్కరిణి వంటి నిర్మాణాలు జరుగుతాయి. రెండో దశలో రూ.120 కోట్లతో మాడ వీధులు, అన్నదాన సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు, పరిపాలన భవనం వంటి నిర్మాణాలు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిపై ఎవరికీ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. పూర్వ ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెట్టి విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. అలాగే, భక్తులు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉండాలని పిలుపునిచ్చి, టీటీడీ అధికారులకు రెండున్నరేళ్లలో ఈ పవిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, సంపద ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. పవిత్ర ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత, అమరావతి నిజంగా దేవతల రాజధానిగా మారబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.