పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారా? జైల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారా?.. ఇదీ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా దేశాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. అయితే.. ఈ వార్తలు, ప్రచారంపై ప్రస్తుత పీఎం షెహబాజ్ సర్కారు నోరు విప్పడం లేదు. పూర్తి మౌనాన్ని పాటిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. మరోవైపు.. ఇమ్రాన్ ఇద్దరు చెల్లెళ్లు మాత్రం మీడియా ముందు రోదిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
అసలు ఏం జరిగింది?
పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీని స్థాపించిన మాజీ క్రికెట్ ఇమ్రాన్.. దేశానికి ప్రధాని కూడా అయ్యా రు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన విదేశాల నుంచి తెచ్చుకున్న బహుమతులను అధికా రం కోల్పోయాక అలానే వదిలి వెళ్లకుండా విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారన్న వాదన ఉంది. దీనిపైనే కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణలు కూడా జరిగాయి. దీనికి తోడు.. ఆయన మాజీ భార్య కూడా భరణం సహా.. వేధింపుల కేసు పెట్టారు.
ఈ రెండు కేసుల్లోనూ అరెస్టయిన ఇమ్రాన్.. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం రావల్పిండి జిల్లాలోని అడియాలా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే.. దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. కానీ, ఎన్నికల సంఘం సదరు పార్టీపై వేటు వేసి.. గుర్తింపును రద్దు చేసింది. దీంతో పీటీఐ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం వీరు ఇమ్రాన్ మద్దతుదారులుగానే కొనసాగుతున్నారు.
2023, ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్న ఇమ్రాన్.. మధ్యలో రెండు సార్లు అనారోగ్యం పాలైనట్టు వార్తలు వచ్చా యి. ఆ సమయంలో స్పందించిన ప్రభుత్వం వైద్యం చేయించామని.. కోలుకున్నారని తెలిపింది. కిడ్నీ, ఊపిరి తిత్తుల సంబంధిత సమస్యతో ఇమ్రాన్ ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే.. అనూహ్యంగా ఇమ్రాన్ ఇకలేరు! అంటూ.. పెద్ద ఎత్తున ప్రధాన మీడియాల్లోనే చర్చలువచ్చాయి. ఇదే ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది.
73 ఏళ్ల ఇమ్రాన్.. అనారోగ్యంతో చనిపోయారని కొన్ని చానెళ్లు ప్రసారం చేస్తుండగా.. కాదు, ఆయనను జైల్లోనే మట్టుబెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక, ఆయన సోదరీమణులు.. అటు జైలు అధికారులు, ఇటు సైనిక ప్రధానాధికారికి కూడా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ సోదరుడి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సర్కారు గంటలు గడిచినా.. ఎలాంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం.