ఏపీలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్ష సభ్యులుగా వ్యవ హరించడం నుంచి బిల్లులపై చర్చ, ప్రశ్నోత్తరాలు.. వాగ్వాదాలు.. వివాదాలు.. ఇలా అచ్చం అసెంబ్లీని తలపించేలా మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థుల ప్రతిభను చూసి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఔరా అని వ్యాఖ్యానించారు. చిన్నారుల ప్రతిభను కొనియాడారు.
అంతేకాదు.. ఇదేసమయంలో కొందరు నెటిజన్లు.. విద్యార్థుల మాక్ అసెంబ్లీని ప్రస్తావిస్తూ.. వైసీపీ అధినేత జగన్‌కు చురకలు అంటిస్తున్నారు. విద్యార్థులను చూసైనా నేర్చుకోవచ్చుగా జగన్ అని వ్యాఖ్యానిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరికొందరు... జగన్ ఇకనుంచైనా మారాలి! అని సూచిస్తున్నారు. అం తేకాదు.. విపక్షంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా సభకు వెళ్లి.. ప్రజల తరఫున ప్రశ్నించడమో మాట్లాడడమో చేయాలని కొందరు చెబుతున్నారు.
మొత్తంగా.. విద్యార్థుల మాక్ అసెంబ్లీ తర్వాత.. వైసీపీపై విమర్శల పర్వం అయితే పెరుగుతోంది. గత ఎన్నికల్లో 11స్థానాలకు పరిమితం అయిన తర్వాత..వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ ముఖం చూడడం లేదు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒకసారి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజు ఒక్కసారి మాత్రమే జగన్.. తన ఎమ్మెల్యేలతో సభకు వచ్చారు. అనంతరం.. ఆయన వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంతోపాటు.. ముఖ్యమంత్రి సభలో ఎంత సేపు మాట్లాడితే.. తనకు కూడా అంత సమయం మాట్లాడేందుకు ఇవ్వాలన్నది జగన్ పెట్టిన డిమాండ్. అయితే.. దీనికి నిబంధనలు ఒప్పుకోవడం లేదని సభాపతి అయ్యన్న పాత్రుడు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో విచారణ దశలో ఉంది. దీనిపై ఎప్పటికి తీర్పు వస్తుందో చూడాలి.
ఇదిలావుంటే.. తాజాగా జగన్‌ను ఉద్దేశించి మాజీ సభాపతి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఎలా వ్యవహరించిం దో చూసైనా జగన్ నేర్చుకోవాలి. చిన్న పిల్లలైనా ఎలాంటి తాత్కాలిక, శాశ్వత బహిష్కరణలకు తావివ్వ కుండా, ప్రజా సమస్యలను సభలోనే ప్రస్తావించారు`` అని వ్యాఖ్యానించారు. ఇది భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉందని పేర్కొన్నారు.