మండ‌లి ఛైర్మన్ డిలే గేమ్‌.. ఆ వైసీపీ ఎమ్మెల్సీల‌కు మోక్షం ఎప్పుడు?

admin
Published by Admin — December 02, 2025 in Politics, Andhra
News Image

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తాజా రాజకీయ దెబ్బ ఇప్పుడే ఆగేలా కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్‌బై చెబుతుండగా… ఆ రాజీనామాలను ఆమోదించే విషయంలో శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు చూపుతున్న డిలే గేమ్ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్‌గా మారింది. ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా వైసీపీని వీడి కూటమి వైపు వెళ్లిపోయినా… వారి రాజీనామాలపై ఎప్పుడు నిర్ణయం? అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

ఎక్కడో స్థానిక నాయకుడు మోషేన్ రాజును జగన్ నమ్మకానికి గుర్తుగా ఎమ్మెల్సీ చేయడమే కాదు… ఏకంగా శాసనమండలి చైర్మన్ అద్దె కుర్చీపై కూర్చోబెట్టారు. ఆ విధేయత ఇప్పుడు ఆయన నిర్ణయాలలో స్పష్టంగా కనిపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రాజీనామాలు ఆమోదం అయితే ఖాళీ అయ్యే స్థానాలు కూటమి ఖాతాలో పడతాయి. అదే పెద్ద కారణంగా మోషేన్ రాజు నిర్ణయాన్ని లాగుతున్నారన్న వ్యాఖ్యానాలు మరింత బలపడుతున్నాయి.

ఈ వ్యవహారం కోర్టు తలుపులు తట్టిన తర్వాత.. వ్యవహారం మరింత సీరియస్ అయింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు సూచనలు ఇవ్వడంతో.. చేసేదేమి లేక‌ మోషేన్ రాజు రాజీనామా చేసిన ఆరు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, జకీయా ఖానుమ్, పోతుల సునీతతో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా మండ‌లి ఛైర్మెన్‌ ఎమ్మెల్సీలను ప్రశ్నిస్తూ… “ఎవరైనా ప్రలోభపెట్టారా? జనసేనలో చేరితే మంత్రి పదవి ఇస్తామని చెప్పారా?” అని నేరుగా అడిగారు. దీనికి జయమంగళ “ఎటువంటి ప్రలోభాలు లేవు… స్వచ్ఛందంగానే వైసీపీని వదిలి జనసేనలో చేరాను. ఇది నా రాజకీయ–వ్యాపార నిర్ణయం మాత్రమే.” అని క్లియ‌ర్ క‌ట్‌గా సమాధానం ఇచ్చారు. మ‌రోవైపు మర్రి రాజశేఖర్ అయితే ఇంకా స్ట్రైక్‌గా మాట్లాడారు. “వైసీపీలో మాకు విలువ లేదు… గౌరవం లేదు. అందుకే బయటకు వచ్చాం. కుల ఆధారిత నిర్ణయమని ప్రచారం చేయడం సరికాదు. టీడీపీలో వైసీపీ కన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంది” అని మ‌ర్రి స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్సీల పదవీకాలం తక్కువగా ఉందన్న కారణంతో చైర్మన్ పునరాలోచన చేయమని సూచించినా… ఆరుగురు ఎమ్మెల్సీలు మాత్రం మాట మార్చే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్సీల రాజీనామాలపై ఛైర్మన్‌ మోషేన్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ ఆరుగురికి మోక్షం ఎప్పుడు? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags
YSRCP MLC Ap News YSRCP MLC resignations Koyye Moshenu Raju Jagan Mohan Reddy YSRCP
Recent Comments
Leave a Comment

Related News