ఐబొమ్మ రవి.. గత కొన్ని వారాలుగా ఈ పేరు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యే రోజే ఆన్‌లైన్‌లో పెట్టి, కోట్లాది మంది చూసేలా చేసి, పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారిన రవి.. ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్నాడు. అయితే విచారణ సమయంలో రవికి ఉన్న సాంకేతిక నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు.. అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. మంచి జీతం ఇస్తాం, సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? అని ప్రశ్నించగా.. అందుకు రవి ఎలాంటి సంకోచం లేకుండా నో చెప్పి పోలీసులకే షాక్ ఇచ్చాడట.
అయితే ``ఐబొమ్మ కథ ముగిసింది… మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?`` అని అడిగినప్పుడు, రవి చెప్పిన సమాధానం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం. తన భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ.. కరేబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ అనే పేరుతోనే ఒక రెస్టారెంట్ ప్రారంభించాలని, అక్కడి ప్రజలకు భారతీయ వంటకాలను పరిచయం చేయాలని తన డ్రీమ్‌ను రవి తెలిపాడట. ఇంతటితో ఆగకుండా, కరేబియన్‌లోని అన్ని దేశాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి, ట్రావెల్ చేస్తూ, లైఫ్‌ను ఎంజాయ్ చేస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పైరసీ వెబ్‌సైట్ వెనుక ఉన్న వ్యక్తి ఇంత లగ్జరీ లైఫ్ డ్రీమ్‌తో ఉండడమే పోలీసులను నివ్వెరపోయేలా చేసింది. ఇప్పటివరకు రవి పైరసీ ద్వారా సంపాదించిన సొమ్ము దాదాపు రూ. 20 కోట్లు కాగా.. అందులో ఏకంగా రూ. 17 కోట్లను పార్టీలు, ట్రిప్స్, ఫన్ కోసం ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అతని లైఫ్‌స్టైల్‌ని చూసి పోలీసులు కూడా నమ్మలేని స్థితికి చేరుకున్నారట. మిగిలిన రూ. 3 కోట్లను, హైదరాబాద్‌లోని ఫ్లాట్, విశాఖలోని ఆస్తులను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. అయినప్పటికీ రవి మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ఇకపై వారానికి ఒక దేశం తిరుగుతూ జీవితం ఆస్వాదిస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది.